WTC Final: టీమిండియా ముంగిట భారీ టార్గెట్: డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేన సాధించేనా!
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‍లో భారత్ ముందు భారీ లక్ష్యం ఉంది. ఈ మ్యాచ్ గెలవాలంటే 444 పరుగులను రోహిత్‍సేన ఛేదించాల్సి ఉంది.
WTC Final: ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‍షిప్ ఫైనల్‍లో టీమిండియా ఎదుట భారీ లక్ష్యం ఉంది. మ్యాచ్ నాలుగో రోజైన నేడు (జూన్ 10) రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా భారత్‍కు 444 పరుగుల టార్గెట్‍ను నిర్దేశించింది. ఇండియా ఈ టార్గెట్ ఛేదించేందుకు నేడు సుమారు 45 ఓవర్లతో పాటు రేపు ఐదో రోజు మొత్తం మిగిలి ఉంది. మరి భారత్ ఈ టార్గెట్‍ను ఛేజ్ చేస్తుందా.. ఆలౌటై టైటిల్ కోల్పోతుందా.. డ్రా కోసం పోరాడుతుందా చూడాలి. లండన్‍లోని ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 270 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. టీమిండియాకు 444 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీ (66 నాటౌట్) అర్ధ శతకంతో అదరగొట్టగా.. మిచెల్ స్టార్క్ (41) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు, ఉమేశ్ యాదవ్, షమీ చెరో రెండు, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టారు.
రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 123 పరుగులు ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ఆస్ట్రేలియా కొనసాగించింది. అయితే తొలి సెషన్ ఆట మొదలైన కాసేపటికే మార్నస్ లబుషేన్ (41)ను భారత పేసర్ ఉమేశ్ యాదవ్ పెవిలియన్‍కు పంపాడు. నెమ్మదిగా ఆచితూచి ఆడిన కామెరూన్ గ్రీన్ (25)ను జడేజా బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ క్రమంగా ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు కనిపించింది. అయితే, ఆ తర్వాత ఆసీస్ కీపర్ అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ (41) భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఆసీస్ ఆధిక్యాన్ని వేగంగా పెంచారు. ఏడో వికెట్‍కు ఏకంగా 93 పరుగులను జోడించారు.
జోరుగా బ్యాటింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్ ను భారత పేసర్ మహమ్మద్ షమీ ఔట్ చేశాడు. కాసేపటిగా ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (5) కూడా షమీ బౌలింగ్‍లోనే పెవిలియన్ చేరాడు. దీంతో 8 వికెట్లకు 270 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది ఆసీస్. భారత్‍కు 444 పరుగుల టార్గెట్ ఇచ్చింది.
ఈ లక్ష్యాన్ని చేజ్ చేసేందుకు భారత్‍కు ఇంకా నేడు సుమారు 45 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఐదో రోజు మొత్తం ఆడాల్సి ఉంది. దీంతో ఒకవేళ ఓ ముగ్గురు బ్యాట్స్‌మెన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. అయితే, నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంత భారీ టార్గెట్ ఛేదిస్తే అది అద్భుతమే అవుతుంది. ఇక ఈ మ్యాచ్‍ను డ్రా చేసుకోవాలన్నా భారత్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరి ఈ భారీ లక్ష్యాన్ని రోహిత్ సేన సుసాధ్యం చేసి.. డబ్ల్యూటీసీ టైటిల్‍ను దక్కించుకోగలదేమో చూడాలి. అయితే, ఇప్పటికీ ఆస్ట్రేలియాదే ఆధిపత్యంగా ఉంది.