Asian Games: ఏషియన్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీలో బాణసంచా మెరుపులు లేనట్లే.. చైనా కీలక నిర్ణయం
Asian Games: ఏషియన్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీలో బాణసంచా మెరుపులు లేనట్లే. ఈ మేరకు చైనా కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని నియంత్రించే ఉద్దేశంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Asian Games: ఏషియన్ గేమ్స్ 2023కు టైమ్ దగ్గర పడింది. ఈసారి ఈ మెగా ఈవెంట్ కు చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ ఈ గేమ్స్ జరుగుతాయి. అయితే ఇలాంటి పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు ఘనంగా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహిస్తారు. అందులో భాగంగా బాణసంచా మెరుపులు ఉండటం కూడా మనం చూస్తూనే ఉంటాం.
కానీ ఈసారి ఏషియన్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీలో మాత్రం బాణసంచా కాల్చకూడదని చైనా నిర్ణయించింది. కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. "హాంగ్జౌ ఏషియన్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీ బాణసంచా కాల్చే సాంప్రదాయానికి తెరదించనుంది. ఈవెంట్ నిర్వహణ సందర్భంగా కూడా హరిత విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాం" అని గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీ జనరల్ డైరెక్టర్ షా షియోలాన్ చెప్పారు.
వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో 27 శాతం ఒక్క చైనా నుంచి ఉండటం గమనార్హం. ఇక గ్రీన్‌హౌజ్ వాయువుల్లో మూడో వంతు కూడా ఈ ఒక్క దేశం నుంచే పర్యావరణంలోకి విడుదలవుతున్నాయి. దీంతో 2060 నాటికి ఈ ఉద్గారాలను సున్నా శాతానికి తీసుకురావడమే లక్ష్యంగా చైనా పని చేస్తోంది.
అందుకోసం భారీగా ఖర్చు చేస్తోంది. హరిత మౌలికసదుపాయాలు, టెక్నాలజీ కోసం మరో 17 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి చైనా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఏషియన్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీలోనూ అసలు బాణసంచా వాడకూడదని గేమ్స్ నిర్వాహకులు నిర్ణయించారు. ప్రపంచంలో ఎలాంటి స్పోర్టింగ్ ఈవెంట్ అయినా ఫైర్ వర్క్స్ లేకుండా జరగవు. కానీ తొలిసారి ఆ మెరుపులు ఇక్కడ కనిపించడం లేదు.