Ashwin Counter to Ramiz Raza: టీమిండియాపై పీసీబీ ఛైర్మన్ షాకింగ్ కామెంట్.. అశ్విన్ అదిరే కౌంటర్-ashwin gives blunt response to ramiz raja billion dollar team statement ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashwin Counter To Ramiz Raza: టీమిండియాపై పీసీబీ ఛైర్మన్ షాకింగ్ కామెంట్.. అశ్విన్ అదిరే కౌంటర్

Ashwin Counter to Ramiz Raza: టీమిండియాపై పీసీబీ ఛైర్మన్ షాకింగ్ కామెంట్.. అశ్విన్ అదిరే కౌంటర్

Maragani Govardhan HT Telugu
Oct 11, 2022 01:32 PM IST

Ashwin Reaction on Ramiz Raza: గత 12 నెలలో పాకిస్థాన్.. టీమిండియాను రెండు సార్లు ఓడించిందని, అప్పటి నుంచి భారత జట్టు.. తమ ప్రత్యర్థులను గౌరవించడం ప్రారంభించిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలపై భారత స్పిన్నర్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు.

రమీజ్ రాజాపై అశ్విన్ వ్యాఖ్యలు
రమీజ్ రాజాపై అశ్విన్ వ్యాఖ్యలు

Ashwin Counter to Ramiz Raza: టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించడమేమో కానీ.. దాయాది జట్టు సీనియర్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం కాస్త పెరిగినట్లు కనిపిస్తోంది. అయితే అది అతి విశ్వాసంగా మారకుండా ఉంటే మంచిదని చాలా మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు. గత 12 నెలలో పాకిస్థాన్.. టీమిండియాను రెండు సార్లు ఓడించిందని, అప్పటి నుంచి భారత జట్టు.. తమ ప్రత్యర్థులను గౌరవించడం ప్రారంభించిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా ఇటీవల అభిప్రాయపడ్డారు. అతడి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. సోమవారం ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌కు హాజరైన అతడిని ఈ విషయం గురించి అడగ్గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా అలా అన్నారని మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. దీని గురించి మాట్లాడాలంటే ఒకే మార్గం ఉంటుంది. ఇది కేవలం ఆట మాత్రమే. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా.. మేము తరచూ వారితో(పాక్) ఆడట్లేదు. ఇరుదేశాల మధ్య పోటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది రెండు దేశాల ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఆటలో గెలుపోటములు భాగమని ఓ క్రీడాకారుడిగా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా" అని రమీజ్ రాజాకు చురకలంటించాడు అశ్విన్.

"ముఖ్యంగా ఈ టీ20 ఫార్మాట్‌లో మార్జిన్‌లు చాలా దగ్గరగా ఉంటాయి. ప్రత్యర్థిని గౌరవించడమనేది గెలుపోటములతో వచ్చే విషయం కాదు. అది మీరు చేసే పనులు, విధానం ద్వారా వస్తుంది. మేము కచ్చితంగా పాకిస్థాన్‌ను గౌరవిస్తాం. వాళ్లు కూడా అలానే చేస్తారు." అని అశ్విన్ స్పష్టం చేశాడు.

"టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా-పాకిస్థాన్ అక్టోబరు 23న ఆడనున్నాయి. ఒకప్పుడు పాకిస్థాన్‌ను ప్రత్యర్థి పోరులో అండర్ డాగ్‌గా పరిగణించే వారు. అయితే ఇటీవల కాలంలో భారత్‌.. పాకిస్థాన్‌కు ప్రాధాన్యత ఉండటం, గౌరవించడం ప్రారంభించింది. పరిమిత వనరులతో బిలియన్ డాలర్ జట్టుగా అభివృద్ధి సాధించిన బాబర్ టీమ్‌ను అభినదించాలి" అని రమీజ్ రాజా.. అభిమానులు, విమర్శకులను కోరారు.

WhatsApp channel

సంబంధిత కథనం