Mahalaya Paksha: మహాలయ పక్షంలో తిథుల ప్రాధాన్యత ఏంటి? ఏ తిథి ఎవరికి తర్పణం వదలాలి?-what is the importance of tithi in mahalaya paksham which tithi should drop tarpanam to whom ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mahalaya Paksha: మహాలయ పక్షంలో తిథుల ప్రాధాన్యత ఏంటి? ఏ తిథి ఎవరికి తర్పణం వదలాలి?

Mahalaya Paksha: మహాలయ పక్షంలో తిథుల ప్రాధాన్యత ఏంటి? ఏ తిథి ఎవరికి తర్పణం వదలాలి?

HT Telugu Desk HT Telugu
Sep 18, 2024 04:49 PM IST

Mahalaya Paksha: మహాలయ పక్షంలో వచ్చే తిథుల ప్రాధాన్యత ఏంటి? ఏ తిథి రోజు తర్పణం వదిలితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి అధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

మహాలయ పక్షాల తిథుల ప్రాధాన్యత
మహాలయ పక్షాల తిథుల ప్రాధాన్యత

పితృదేవతల ఆరాధన రోజులు మహాలయ పక్షాలు అని పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. భాద్రపద మాస బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ ఈ మహాలయ పక్షంగా గణిస్తారన్నారు.

జనసామాన్యం తమ పితరులు ఏ తిథిన మరణిస్తే ఈ మహాలయ పక్షంలో ఆ తిథినాడు పితరులకు తర్పణాలను వదలడం, పిండ ప్రదానం తదితర విధులను చేస్తుంటారని, కానీ ఈ పదిహేను రోజులూ ఆ కార్యక్రమాలు చేయడం ఉత్తమమని ప్రభాకర చక్రవర్తి శర్మ పేర్కొన్నారు. ఈ పదిహేను రోజుల్లోనూ పితృ దేవతలను ఆరాధిస్తే వారు సంతుష్టులై వంశాభివృద్ధికి సహకరించడమే కాక భోగభాగ్యాలను అనుగ్రహిస్తారని చిలకమర్తి తెలిపారు.

ఈ పదిహేను రోజులూ పితృదేవతలను ఆరాధిస్తే తిథికొక ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయని ఆధ్యాత్మిక వేత్త ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. పాడ్యమి తిథినాడు పితృదేవతలను ఆరాధిస్తే ధనసంపద కలుగుతుందన్నారు. విదియనాడు చేసే పితృకార్యాల వలన రాజయోగం, విశేషమైన సంపద లభిస్తాయి. తదియనాడు పితృదేవతలను పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. చవితినాడు చేసే పితృకార్యాల వలన ఇష్టకామ్యప్రాప్తి, ధర్మగుణం కలుగుతుందన్నారు. పంచమి నాటి ఆరాధన వలన విశేషమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.

షష్ఠినాడు పితృదేవతలను పూజిస్తే మంచి గౌరవం లభిస్తుందన్నారు. సప్తమినాటి పితృదేవతారాధనతో యజ్ఞం చేసిన పుణ్యఫలం దక్కుతుందని చిలకమర్తి పేర్కొన్నారు. అష్టమి తిథినాడు పితృ దేవతలను పూజిస్తే మంచి బుద్ధి, సంపూర్ణ సమృద్ధి కలుగుతాయన్నారు. నవమి నాటి ఆరాధనతో విస్తారంగా సంపద సమకూరుతుందని చిలకమర్తి తెలిపారు. దశమినాడు పితృదేవతలను పూజిస్తే ధాన్య, పశుసంపద వృద్ధి కలుగుతుందని అన్నారు.

ఏకాదశినాడు చేసే పితృదేవతారాధన వలన సర్వశ్రేష్ట దానఫలం లభిస్తుందన్నారు. పితృదేవతలను ద్వాదశినాడు ఆరాధిస్తే ఆహారభద్రత కలుగుతుందని, అంతేకాకుండా సమాజాభివృద్ధి జరుగుతుందన్నారు. త్రయోదశి నాడు చేసే పితృదేవతారాధన వలన ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం ప్రాప్తిస్తాయని పంచాంగకర్త ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. చతుర్దశి నాడు పితృదేవతలను ఆరాధిస్తే శత్రుభయం నుంచి విముక్తి కలుగుతుందని, అమావాస్యనాటి పితృ దేవతారాధనతో అన్ని కోరికలు నెరవేరుతాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

టాపిక్