ఈ స్వామి వారిని దర్శించుకుంటే దీర్ఘాయువు.. అనారోగ్య బాధలు తొలగించే క్షేత్రం ఇది
అనారోగ్య బాధలు తొలగించి దీర్ఘాయువును ప్రసాదించే క్షేత్రం గురువాయూరప్పన్. ఈ ఆలయం ఎక్కడ ఉంది? దీని విశేషాలు, మహత్యం ఏంటి అనే వివరాలు పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కేరళ రాష్ట్రంలో గురువాయూర్ క్షేత్రం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటని, ఈ క్షేత్రంలో వెలసిన శ్రీ కృష్ణుడిని గురువాయూరప్పన్ (మహావిష్ణువు) అని పిలుస్తుంటారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఇక్కడ శ్రీ కృష్ణుడు స్వయంగా కొలువైనట్టు, ఈ ఆలయానికి శంకరాచార్యులు విచ్చేసినట్లు శాస్త్రాల్లో చెప్పబడిందని చిలకమర్తి తెలిపారు. ఈ ఆలయంలో ఉన్న స్వామి నాలుగు చేతులతో, పాంచజన్యం (శంఖం), సుదర్శన చక్రం, గద, కమలం చేత ధరించి ఉంటాడని, ఆయన మెడలో తులసిమాల ఉంటుందని చిలకమర్తి తెలిపారు. ఈ ఆలయాన్ని విశ్వకర్మ, బృహస్పతి, వాయు దేవుడు కలిసి ప్రతిష్టించిన్నట్లుగా పురాణాలు తెలియజేస్తున్నాయని చిలకమర్తి తెలిపారు.
మహాభారతం ప్రకారం జనమేజయుడు తండ్రి అయినటువంటి పరీక్షితుడు.. తక్షకుడు కాటు వేయడం చేత మరణిస్తాడు. దాంతో సర్ప జాతి అనేది ఉండకూడదని భావించి, ఆ జాతి నాశనం కోసం జనమేజయుడు సర్పయాగం చేశాడు. అనేక సర్పాలను యాగంలో భాగంగా సంహరించాడు. ఆస్తికముని ప్రభావం వల్ల ఆ యాగాన్ని ఆయన విరమించుకున్నాడు. అయినప్పటికీ అనేక సర్పాలను సంహరించడం చేత జనమేజయుడికి కుష్ఠి వ్యాధి సోకింది. ఆ వ్యాధి సోకి బాధపడుతున్న జనమేజయుడికి ఆస్తిక మహాముని ఆత్రేయ మహర్షి గురువాయూర్‌లో ఉన్న శ్రీ కృష్ణుడి ఆలయానికి వెళ్లి ఆయన పాదాల వద్ద ఉండి స్వామివారిని పూజించమని చెప్పెను.
అలా ఆత్రేయ మహర్షి చెప్పిన విధంగా జనమేజయుడు పది మాసాలు గురువాయూర్‌లో ఉండి శ్రీకృష్ణుడిని పూజించెను. స్వామివారిని పూజించడం చేత అతనికి సోకిన కుష్టి వ్యాధి తొలగిపోయెను. అప్పుడు ఆ స్వామి గొప్పతనాన్ని తెలుసుకున్న జనమేజయుడు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించినట్టుగా మహాభారతం తెలియజేస్తుందని చిలకమర్తి తెలిపారు.
ఈ ఆలయ దర్శనం వల్ల దీర్ఘకాలిక రోగాలు తొలగి, వ్యాధులు దూరమై, ఆరోగ్యం సిద్ధిస్తుందని చిలకమర్తి తెలిపారు. ప్రస్తుతం గర్భాలయంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు తయారుచేసి పూజించాడని పురాణాలు తెలియజేస్తున్నాయని చిలకమర్తి తెలిపారు.
బ్రహ్మదేవుడు ఆ విగ్రహాన్ని విష్ణుమూర్తికి ఇవ్వగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తనతో తెచ్చుకుని తన చివరి కాలంలో ఉద్ధవుని చేతికి ఇచ్చి ఆ విగ్రహాన్ని బృహస్పతి, వాయుదేవుల చేత సరైన స్థలంలో ప్రతిష్ఠింప చేయమని తెలుపగా వారు ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. బాలకృష్ణుడిగా నల్లని రూపంలో స్వామివారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు.
16వ శతాబ్దంలో నారాయణభట్టు అనే ఆయనకి ఘోరమైన వ్యాధి వచ్చినపుడు ఆయన గురువాయూర్ వచ్చి స్వామిని దర్శించి నిత్యం ఆ స్వామిపై పది శ్లోకాలను రచించి స్తుతించేవాడంట. అలా ఆయన వెయ్యి శ్లోకాలను పూర్తి చేయగానే వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందట. ఆయన రచించిన శ్లోకాలన్నీ కేరళ అంతటా “నారాయణీయం" అనే పేరుతో ప్రాచుర్యం చెందాయని చిలకమర్తి తెలిపారు. ఇక్కడ కొలువైన స్వామిని దర్శించినంతనే ఆయురారోగ్యాలు సొంతమవుతాయని భక్తుల విశ్వాసమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అన్నారు.