Vasanth Panchami Puja Rituals : వసంత పంచమిరోజు అమ్మవారిని ఇలా పూజించండి..
Vasanth Panchami 2023 : మాఘమాసం వచ్చిన ఐదో రోజునే మనం వసంత పంచమిని జరుపుకుంటాము. ఆరోజును సరస్వతి దేవి పుట్టిన రోజుగా చెప్తారు. అందుకే పిల్లలకు వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. అసలు ఇంతకీ వసంత పంచమి రోజున అమ్మవారికి పూజను ఎలా చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vasanth Panchami Puja Rituals : వసంత పంచమి ఈ సంవత్సరం జనవరి 26వ తేదీన వచ్చింది. మాఘమాసం వచ్చిన ఐదో రోజున దీనిని చేసుకుంటారు కాబట్టి దీనికి వసంత పంచమి అనే పేరు వచ్చింది. దీనినే సరస్వతిదేవి పుట్టినరోజు అంటారు కాబట్టి.. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఆరోజు ఉదయాన్నే నిద్రలేచి.. స్నానం చేయాలి. ఉతికిన లేదా కొత్త తెల్లని వస్త్రాలు ధరించి గంధము పూసుకోవాలి. అనంతరం పూజకోసం ఓ ప్రదేశాన్ని బాగా శుభ్రం చేయాలి. అక్కడ పద్మము, శంఖము, చక్రం ముగ్గు వేసి.. దానిపై పీటను ఉంచాలి.
అనంతరం పీటపై సరస్వతీ దేవి ప్రతిమను లేదా ఫోటోను ఉంచి.. ముందుగా గణపతి పూజచేయాలి. అనంతరం అమ్మవారి ఫోటో ముందు మినప పిండితో చేసి ప్రమిదలో నెయ్యి వేసి.. ఒత్తి పెట్టి దీపం వెలిగించాలి. కొత్త పుస్తకాలను, పెన్నును అక్కడ ఉంచి పూజ చేయాలి. అమ్మవారిని తెల్లని కమలాలతో లేదా ఏవైనా తెల్లని పువ్వులతో అర్చించాలి. అనంతరం మాల వేసి.. సుగంధ ద్రవ్యాలు రంగరించిన గంధము సమర్పించాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించాలి. అవేంటంటే..
నూకలు లేకుండా అన్నంతే చేసిన పాలన్నం, తెల్లని నువ్వులతో చేసిన ఉండలు.. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు వెన్న..ఇలాంటి వాటిని మీ శక్తి కొద్ది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తెల్లని వస్త్రాలను అమ్మవారికి అందించాలి. అమ్మవారి మంత్రాన్ని 21 మార్లు చదివి.. హారతి ఇవ్వాలి.
* మంత్రాలలో మొదటిది
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి....
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా.....
* రెండవది
ఓం వాగ్దేవ్యైచ విద్మహే.. బ్రహ్మపత్న్యైచ
ధీమహీ.. తన్నో వాణీ ప్రచోదయాత్..
* మూడవది
ఓం సరస్వత్యైనమ:
ఈ విధంగా మీకు ఏది వీలైతే దానిని 21 మార్లు చదివి.. అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఇలా చేసిన వారందరికీ.. తప్పనిసరిగా.. చదువుల తల్లి సరస్వతి దీవెనలు ఉంటాయి.
సంబంధిత కథనం