Vasantha Panchami Rituals : వసంత పంచమిరోజు చేయాల్సిన పనులు, పూజలు ఇవే..-vasantha panchami rituals and significance and date in 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Vasantha Panchami Rituals And Significance And Date In 2023

Vasantha Panchami Rituals : వసంత పంచమిరోజు చేయాల్సిన పనులు, పూజలు ఇవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 21, 2023 02:00 PM IST

Vasantha Panchami Rituals : మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమి అని, శ్రీపంచమి అని అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకు కొన్ని పండుగలు జరుపుతుంటారు. అలాంటివాటిలో శ్రీపంచమి ఒకటి. మాఘ శుద్ధ పంచమినాడు ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని సరస్వతీ జయంతి, మదన పంచమి అని కూడా అంటారు. మరి దీని ప్రాముఖ్యత ఏమిటో.. ఆరోజు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వసంత పంచమి
వసంత పంచమి

Vasantha Panchami Rituals : మాఘ శుద్ధ పంచమి అనేది ఋతు సంబంధమైన పర్వం. వసంత ఋతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొన్నారు. వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చెప్పారు. ఈ పండుగ మాఘ శుద్ధ పంచమినాడు (జనవరి- ఫిబ్రవరి) వస్తుంది. ఈ సంవత్సరం జనవరి 26వ తేదీన వసంత పంచమిని చేసుకోనున్నారు. తూర్పు భారత దేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైనవాటిని చదువుల తల్లి సరస్వతీదేవి అంశలుగా భావిస్తారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్తారు.

ట్రెండింగ్ వార్తలు

శ్రీపంచమిని విద్యారంభ దినంగా భావిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని బాసర క్షేత్రంలోను, ఇతర సరస్వతీ దేవాలయాలలో శ్రీ పంచమినాడు పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా నిర్వహిస్తారు. వసంత పంచమి రోజు లక్ష్మీదేవి పూజ చేయాలని హేమాద్రి తెలిపారు. రతీమన్మథులను పూజించి మహోత్సవమొనరించవలెనని.. దానము చేయాలని, దీనివలన మాధవుడు (వసంతుడు) సంతోషిస్తాడని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు.

"మాఘశుద్ధ పంచమినాడు వసంతరుతువు ప్రారంభమగును. ఆరోజు విష్ణువును పూజించాలి. చైత్రశుద్ధ పంచమినాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను” అని వ్రతచూడామణిలో ఉంది. సరస్వతీ శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్ కోటిచంద్ర ప్రభాముష్టపుష్ట శ్రీయుక్త విగ్రహమ్ వహ్ని శుద్ధాంశుకాధానం వీణాపుస్తక ధారిణీమ్ రత్న సారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితామ్.

జ్ఞానశక్తికి అధిష్టాన దేవత

సరస్వతీ దేవి జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని అనుగ్రహిస్తుందంటారు. సత్వరజస్తమోగుణాలను బట్టి అమ్మలగన్న అమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రితవరదాయినిగా దర్శనమిస్తుంది. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక.

జలం జీశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంతరుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదే శక్తిదాయిని. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే.. ఆ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. ఉత్తర భారతంలో ఈపూజను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పర్వదినానికే శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈరోజు పూజించడం విశేష ఫలప్రదమని చెప్తారు.

శ్రీపంచమినే రతికామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామ దేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. రుతురాజు అయిన వసంతానికి, కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత. కాముడు ప్రేమదేవత. రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరిఢవిల్లుతాయనే లోకోక్తి కూడా ఉంది. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనమే- వసంత పంచమి పర్వదినం.

రుద్రుని భ్రుకుటి నుంచి అనగా కనుబొమల నుంచి ఆవిర్భవించిన ఈ జ్ఞానశక్తి బ్రహ్మను అనుగ్రహించిందని శాస్త్రోక్తి. తారిణి, తరళ, తార, త్రిరూపా, ధరణీరూపా, స్తవరూపా, మహాసాధ్వీ, సర్వసజ్జనపాలికా, రమణీయా, మహామాయా, తత్త్వజ్ఞానపరా, అనఘా, సిద్ధలక్ష్మి, బ్రహ్మాణి, భద్రకాళి, ఆనందా... అనేవి తంత్రశాస్త్రాల ఆధారంగా ఈ దేవతా దివ్యనామాలు.

ఎలా పూజించాలంటే..

ఈ రోజున సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేదా పసుపురంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం వండి.. నేతితో చేసిన పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం నివేదించాలి. అమ్మవారిని ఇలా పూజిస్తే అనుగ్రహం లభిస్తుంది. కులమత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతీదేవిని పూజిస్తున్నా మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంది. పుష్య, మాఘ ద్వయంతో కూడిన ఆదివారం రోజున శ్రీపంచమి వస్తే.. ఆరోజున సూర్యారాధన వల్ల కోటి గ్రహణ స్నాన పుణ్యఫలం లభిస్తుంది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్