Bhishma Ashtami 2024: నేడే భీష్మాష్టమి.. పితృదోషం తొలగిపోవాలంటే ఈరోజు ఇలా పూజ చేయండి
bhishma Ashtami 2024: నేడు ఫిబ్రవరి 16న భీష్మాష్టమి జరుపుకుంటారు. ఈరోజు తర్పణాలు వదిలి ఉపవాసం ఉండటం వల్ల పితృ దోషం తొలగిపోతుంది. నిజాయితి కలిగిన సంతానం పొందుతారు.

మహా భారతంలోని గొప్ప పోరాట యోధుడు భీష్ముడికి అంకితం చేసిన రోజు భీష్మాష్టమి. ఫిబ్రవరి 16న భీష్మాష్టమి జరుపుకుంటారు. హిందువులు మహా మాసం శుక్ల పక్షం అష్టమి నాడు ఈ ఉపవాసం ఉంటారు. ఈరోజే భీష్ముడు లోకం విడిచి వెళ్లాడని నమ్ముతారు. ఈరోజు తర్పణాలు వదలడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
భీష్మాష్టమి తిథి
తిథి ప్రారంభం: ఫిబ్రవరి 16, ఉదయం 8.54 గంటల నుంచి
తిథి ముగింపు: ఫిబ్రవరి 17, ఉదయం 8.15 గంటల వరకు
భీష్మాష్టమి ప్రాముఖ్యత
భీష్మ అష్టమి రోజు భీష్ముడిని పూజించడం వల్ల ధర్మం, సత్యం పరోపకారం వంటివి సద్గుణాలు అలవడతాయని నమ్ముతారు. భీష్ముడు ధర్మరాజుకి మహా భారత యుద్ధం, ధర్మం గురించి బోధించాడని చెప్తారు. తన తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు. తన మరణాన్ని తానే నిర్ణయించుకోగల వరం పొందిన వ్యక్తి భీష్ముడు. ఉత్తరాయణ కాలంలో మరణించాలని అప్పటి వరకు అంప శయ్య మీద జీవించి ఉన్నాడు. ఉత్తరాయణం వచ్చిన తర్వాత మరణించాడు. ఈ స్మయంవ మరణించడం వల్ల మోక్షం పొందుతారని విశ్వాసం.
ఈరోజు కొంతమంది భక్తులు ఉపవాసం ఉంటారు. స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి భీష్ముడికి పూజ చేస్తారు. ఈరోజు తర్పణం సమర్పించడం ఆచారం. ననువ్వులు, నీళ్ళు, పూలతో తర్పణం వదులుతారు. భీష్మాష్టమి రోజు చేసే దానానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. పితృదేవతలని తలుచుకుని బియ్యం, పప్పు, వస్త్రాలు, డబ్బు వంటివి వాటిని అవసరంలో ఉన్న వారికి దానం చేస్తారు. ఈరోజు తర్పణాలు వదిలితే భీష్మ పితామహుడు, పూర్వీకుల ఆత్మకి మోక్షం లభిస్తుందని అంటారు. పవిత్ర నదిలో స్నానం ఆచరించిన తర్వాత తర్పణాలు వదలాలి.
భీష్మాష్టమి ప్రయోజనాలు
భీష్ముడుకి పూజ చేయడం వల్ల విధేయతి కలిగిన సంతానం పొందుతారు. పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. అదృష్టం మీకు అండగా నిలుస్తుంది. సనాతన హిందూ ధర్మంలో ఈరోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మాష్టమి రోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల మంచి బుద్ధి, నిజాయతీ కలిగిన బిడ్డలు జన్మిస్తారని విశ్వాసం. పుణ్యం, శాంతిని కలిగించే పవిత్రమైన రోజు ఇది. ఈరోజు తర్పణాలు వదలితే భీష్ముడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు.
భీష్మ పితామహుని బోధనలు
తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని భీష్ముడు పాటిస్తాడు. కోపాన్ని విడిచి పెట్టి ఇతరులను క్షమించాలని, వారి మీద కరుణ చూపించాలని సూచించాడు. ఏదైనా కార్యం తలపెడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి పనులు పూర్తి చేయాలి. తోటి వారి పట్ల ప్రేమ, దయ చూపించాలి. ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ధర్మ మార్గంలో నడవాలని, కష్టపడి పని చేయాలని భీష్ముడు బోధించాడు. అందరినీ రక్షించాలని చెప్పాడు.
భీష్మ తర్పణ శ్లోకం
వయ్యాఘ్రపత్ర గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ |
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే|
అపుత్రాయ దదామ్యేతదుదకం భీష్మవర్మణే|
వసునామవతారాయ శంతనోరాత్మజాయ చ|
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల్యబ్రహ్మచారిణే||