Subrahmanya Sashti: సుబ్రహ్మణ్య షష్టి - స్కంద షష్టీ.. ఈ పండగ విశిష్టత ఏంటి?
Subrahmanya Sashti: సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్టీ అని కూడా అంటారు. ఈ డిసెంబరు 18 సోమవారం రోజు వస్తోంది. ఈ పండగ విశిష్టత ఏంటి? దీని వెనక గల కథ ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
మార్గశిర శుద్ధ షష్టిని సుబ్బారాయుడి షష్టి అని, సుబ్రహ్మణ్య షష్టి అని, స్కంధ షష్టి అని రకరకాలుగా పిలుచుకోవడం జరుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సుబ్రహ్మణ్య షష్టి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్టి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం.
ముఖ్యముగా తమిళనాడులోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు మరియు కుమారస్వామి వార్ల దేవాలయాలు గల ప్రతి చోట ఈ సుబ్రహ్మణ్య షష్టి రోజు, దీపావళి అమావాస్య తరువాత షష్టి నాడు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు.
సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న పేర్లు
సుబ్రహ్మణ్యుడికి షణ్ముఖుడు.. అంటే ఆరు ముఖాలు గలవాడని, పార్వతి పిలిచిన పదాన్ని బట్టి స్కంధుడు అని అంటారు. కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడని కార్తికేయుడు అంటారు. శూలము ఆయుధముగా గలవాడు శూలాయుధుడు అని అంటారు. శరవణ భవుడు అంటే శరములో అవతరించినవాడు. గంగలోనుంచి వచ్చినవాడు కాబట్టి గాంగేయుడు అని, దేవతల సేనానాయకుడని సేనాపతి అంటారని, బ్రహ్మజ్ఞానము తెలిసినవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అని అంటారని చిలకమర్తి వివరించారు. మురుగన్ అని తమిళంలో పిలుస్తారు.
దోషాల నివారణకు
మార్దశిర శుద్ధ షష్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి, స్కంధ షష్టి, సుబ్బారాయుడి షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించడం తప్పనిసరి. నాగదోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య అరాధనమే తరుణోపాయం. స్కంధ పంచమి, షష్టి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్మాంద పురాణం చెబుతున్నదని ప్రముఖ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పూజామందిరంలోని సుబ్రహ్మణ్యస్వామి పటాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించుకొని సుబ్రహ్మణ్యాష్టకంతో స్వామిని ప్రార్ధించేవారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.
నమస్తే నమస్తే మహా శక్తి పాణే!
నమస్తే నమస్తే లసద్వజ పాణే।
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే।
నమస్తే నమస్తే సదాఖీష్ట పాణే॥
ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు అని శరణు వేడిన వారికి శక్తి యుక్తుల్ని ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు.
సుబ్రహ్మణ్య స్వామిని నాగు రూపంలో ఎందుకు పూజించాలి?
మార్గశిర శుక్ల షష్టికే సుబ్రహ్మణ్య షష్టి అని పేరు. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామినే సుబ్రహ్మణ్యుడు అంటారు. తారకాసుర వధ కోసం జన్మించిన ఇతడు పసిబాలుడిగా తల్లి ఒడిలో ఉన్న సమయంలోనే ప్రణవమంత్ర రహస్యాన్ని శివుడు పార్వతికి వివరించాడట. దానిని పార్వతితో పాటు కుమారస్వామి కూడా విని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. ఆ మంత్రార్థాన్ని తెలుసుకున్నాననే అహంకారం కూడా పెరిగిపోయి బ్రహ్మదేవునితోనే వాదనకు దిగాడని, విరించినే ధిక్కరించే సాహసం చేశాడని తెలుసుకున్న శివుడు కుమారుని మందలించి ప్రాయశ్చిత్తంగా యోగసాధన చేయమన్నాడు. తండ్రి మాట శిరోధార్యంగా సాధన ప్రారంభించాడు.
ఆ సాధనాక్రమంలో మూలాధార (చక్రం)లో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి మేల్కొని క్రమంగా మణిపూరక, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలను దాటి సహస్రారం వరకు వ్యాపించి బుద్ధి వికాసం జరిగింది. ఇన్ని చక్రాలు (మన) శరీరంలో ఇమిడి ఉన్న తీరు సర్పాకృతిలో ఉంటుంది. వీటన్నిటినీ దాటుకుంటూ సహస్రారం (వెయ్యి రేకులు గల తామరపూవు)లా బుద్ధి వికాసం చెందిన తీరు వేయిపడగల నాగులాగా గోచరమవుతుంది. అందువల్ల అత్మజ్ఞానం పొందిన సుబ్రహ్మణ్యస్వామిని నాగుల రూపంలో ఆరాధించడం ఆచారంగా వచ్చింది. కరాల సర్పదోషాలలో ఏ ఒక్కటి ఉన్నా సుబ్రహ్మణ్య షష్టి నాడు సర్పసూక్తం చదువుతూ ప్రత్యేక పూజలు చేయడం ఒక్కటే ఉపాయం.
షష్టి తిథినాడే స్కందుడు ఆరుగురు కృత్తికలనుంచి ఏకకాలంలో పాలు తాగాడని, అందుకు వీలుగా ఆరుముఖాలు ఉంటాయని పురాణోక్తి. అందుకే ఆయనను షణ్ముఖుడు అంటారు. మనిషి వెన్నెముకలోని షట్చక్రాలకు ఆరు ముఖాలు సంకేతములని, సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలినీ శక్తి అనే సుషుమ్నా నాడిని షణ్ముఖుడని అంటారు. జ్జానిలో పాము తోక మూలాధారంలో, తల సహస్రారంలోని పరమేశ్వరునిలో ఐక్యం పొంది ఉంటాయి.
కనుక ధ్యాననిష్ట ద్వారా మానవుడు కుండలినీ శక్తిని సహస్రారంలోని పరమేశ్వరునిలో ఐక్యం చేయాలనేది బోధపడుతుంది. నాగుపామును చూచిన వెంటనే నాగన్నా! నువ్వు మా జోలికి రాకు, మేము నీ జోలికి రాము అంటూ దండం పెట్టుకోవాలని పెద్దలు చెపుతుంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.