Navaratri 3rd Day: నవరాత్రులలో మూడోరోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతార విశిష్టత
దేవీ నవరాత్రులలో మూడో రోజు అశ్వయుజ శుద్ధ తదితయ 17 అక్టోబరు 2023 రోజన అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. భిక్షాందేహి కృపావలంబన కరీ, మాతాన్నపూర్ణే శ్వరి! అని ప్రార్ధిస్తూ ఆరాధిస్తారని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దేవీ నవరాత్రులలో మూడో రోజు అశ్వయుజ శుద్ధ తదితయ 17 అక్టోబరు 2023 రోజన అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్ అన్నపూర్ణాదేవి కటాక్షం. ఆ పరమాత్మే ఆదిభిక్షువుగా భిక్షను స్వీకరించినట్లుగా మనకు అనేక పురాణ గాథల ద్వారా తెలుస్తోంది. అన్నం ప్రతి జీవిలోనూ ప్రాణశక్తికి ఆధారం. అందుకే మనం భోజనం చేసే ముందు, ప్రతిసారి అన్నం ఆ భగవంతుని ప్రసాదంగా భావించి కృతజ్ఞతలు తెలుపుకుంటే ఎంతో తృప్తిగా దానిని స్వీకరించగలుగుతామని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సాధారణంగా ఎవరికైనా కడుపునిండా భోజనం పెడితే ఆ వ్యక్తి చాలా సంతోషంతో ఆకలిగా ఉన్న నాకు సాక్షాత్తు అన్నపూర్ణలాగా అన్నం పెట్టావు తల్లీ! అని అంటూ ఉంటారు. ఆ మాట అక్షరాలా నిజం కూడా. భోజనం పరమ ఆప్యాయతతో పెట్టిన వారందరూ అన్నపూర్ణలే! ఇంటికి వచ్చిన అతిథులకు కానీయండి, ఇంటిలోని వారికే కానీయండి. ఎవరికైనా అన్నం వడ్డన చేసేటప్పుడు వడ్డన చేసే ఆ వ్యక్తి కళ్ళలోని ఆప్యాయతే అన్నపూర్ణతత్వాన్ని తెలియచేస్తుంది. భోజనం చేసిన వారి కళ్ళలోని తృప్తిని చూసి మురిసే సంతోషమే అన్నపూర్ణ. అందుకే అన్నపూర్ణతత్వాన్ని చూపించడం అందరికీ సాధ్యం కాదని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జీవికోటికి ప్రాణాధారం అయిన అన్నం ఈమె అధీనం. పరమేశ్వరునికే భిక్ష వేసి ఆదిభిక్షువుని చేసింది కనుక మనమందరం ఈరోజున వామహస్తమున అక్షయమైన అన్నపాత్ర, దక్షిణహస్తమున ఒక గరిటతో భక్తులకు ప్రసాదిస్తున్న మాతను మనోనేత్రంతో దర్శించుకుంటూ అన్నపూర్తా అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజించుకుని పునీతులమవుదామని చిలకమర్తి తెలిపారు. ఈరోజునే తల్గ్లులందరూ స్తనవృద్ధి గౌరీ వ్రతం అని కూడా జరుపుకుంటారు. తల్లులు తమ సంతానానికి తల్లిపాలకి లోటు రాకుండా అమ్మవారు అనుగ్రహిస్తుందని అపారమైన నమ్మకంతో ఈ వ్రతం ఆచరిస్తూ, జగన్మాతను అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు. ఈరోజు ధరించవలసిన వర్ణం గంధం రంగు. దద్దోజనం మరియు కట్టెపొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్చిస్తారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
చదవాల్సిన శ్లోకం
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్థూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహీ కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
పుణ్యఫలం
లోకంలో జీవుల ఆకలి తీర్చడం కంటే మించిన అదృష్టం లేదు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దుర్గా మాతను దర్శించి తరించడం వల్ల అన్నాదులకు లోటు లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యం పొందుతారు.