ఆత్మహత్య చేసుకున్న వారికి ఈరోజు ఇలా పిండం పెడితే వారి ఆత్మ శాంతిస్తుంది-if pinda daan is given today to those who have committed suicide their soul will be at peace ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆత్మహత్య చేసుకున్న వారికి ఈరోజు ఇలా పిండం పెడితే వారి ఆత్మ శాంతిస్తుంది

ఆత్మహత్య చేసుకున్న వారికి ఈరోజు ఇలా పిండం పెడితే వారి ఆత్మ శాంతిస్తుంది

HT Telugu Desk HT Telugu
Oct 02, 2024 07:00 AM IST

మహాలయ అమావాస్య రోజు పూర్వీకులతో పాటు అర్థాంతరంగా తనువు చాలించిన వారికి పిండ దానాలు చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మకు శాంతి చేకూరి ప్రేతాత్మలుగా మారకుండా ఉంటారని అధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మహాలయ అమావాస్య
మహాలయ అమావాస్య

పూర్వీకులు దేవతలా అంటే అవుననే పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. గతించిన తండ్రి, అమ్మ, తాత, బామ్మ, ముత్తాత, ముత్తవ్వ వారిపూర్వీకులు అందరూ దేవతలేనని, వారిని పితృదేవతలు అంటారని చిలకమర్తి తెలిపారు.

దేవతలను ఆరాధిస్తే ఎలాగైతే శుభాలు చేకూరుతాయో అలాగే పితృదేవతలను ఆరాధిస్తే వంశాభ్యున్నతి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. పితృదేవతలలో తండ్రి దేవతకు అధిదేవత బ్రహ్మదేవుడు. తాత దేవతకు అధిదేవత విష్ణువు. ముత్తాత దేవతకు అధిదేవత మహారుద్రుడు అని చిలకమర్తి వివరించారు. ఇలా త్రిమూర్తులు తండ్రి, తాత, ముత్తాత రూపంలో ప్రతిజీవికీ చెందుతారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకరచక్రవర్తి శర్మ తెలిపారు.

తండ్రి తన తండ్రికి, తాతకు, ముత్తాతకు పిండ ప్రదానాలు చేస్తారని, ఆయన మరణిస్తే ఆయనను తండ్రి స్థానంలో చేరుస్తారని, తండ్రి ముత్తాతను ఆదిత్యులలో కలుపుతారని చిలకమర్తి తెలిపారు. తండ్రి, తాత, ముత్తాతలను మనం బ్రహ్మ, విష్ణు, రుద్ర అంశలుగా అర్చిస్తామన్నారు. మరణించిన పదో రోజున పితృ దేవతలలో కలుపుతారని, దీనినే సపిండీకరణం అంటారని చిలకమర్తి తెలిపారు. జీవికి అంతవరకూ ఉన్న ప్రేతరూపం పోయి దేవతా (వసు)రూపం కలుగుతుంది. సహజ మరణం పొందినవారే ఇలా పితృదేవతా రూపాలను పొందగలుగుతారని చిలకమర్తి తెలిపారు. వారు పితృలోకంలో ఉంటారన్నారు. వీరు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఆదిత్య రూపాల్లో తమ వంశీకులను రక్షిస్తారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్నవారు వారు అథోగతి పాలవ్వడమే కాకుండా తమ పూర్వీకులను సైతం అవస్థల పాల్జేసినవారవుతారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం సహజ మరణం పొందిన వారికి మాత్రమే పితృదేవతాస్థానం లభిస్తుంది. ఆత్మహత్య చేసుకున్నవారు ప్రేతాత్మగానే మిగిలిపోతారు. వారికి పితృదేవతాస్థానం లభించదు. దాంతో పితృదేవతా వారసత్వం గొలుసు తెగిపోయి పూర్వీకులు సైతం పిండోదకాలు లేక అలమటించాల్సి వస్తుంది. అలా ఆ వంశం మొత్తం నరకం పాలవుతుంది.

పితృదేవతారాధనకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం బీహార్‌ రాష్ట్రంలోని గయ అని చిలకమర్తి తెలిపారు. సహజమరణం పొందిన వారి పిండాలను గయ క్షేత్రంలోని విష్ణు పాదాలపై ఉంచడం జరుగుతుంది. కానీ అసహజ మరణం పొందిన (ఆత్మహత్య చేసుకున్న) వారి పిండాలను కూపశ్రార్ధం చేసి గయక్షేత్రంలోని బావిలో పడవేస్తారు.

ఆత్మహత్య చేసుకున్నవారి పిశాచత్వాన్ని తగ్గించడానికి నాగబలి అనే ప్రాయశ్చిత్తం చేస్తారని, అయితే దీనివల్ల ఆత్మహత్య చేసుకున్నవారి పూర్వీకులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని చిలకమర్తి తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నవారి పిండాలు మాత్రం బావిలోనే వేస్తారన్నారు. పితృదేవతలను వారు మరణించిన రోజున, అమావాస్య తిథి నాడు, మహాలయ పక్షం రోజుల్లో అర్చిస్తే బ్రహ్మవిష్ణు మహేశ్వరులను ఏకకాలంలో అర్చించినట్టే అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ అన్నారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

టాపిక్