ఈరోజు రాశి ఫలాలు.. దక్షిణామూర్తిని చూస్తే శుభ ఫలితాలు-horoscope today in telugu check vedik astrology predictions for 12 moon signs on thursday june 15 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజు రాశి ఫలాలు.. దక్షిణామూర్తిని చూస్తే శుభ ఫలితాలు

ఈరోజు రాశి ఫలాలు.. దక్షిణామూర్తిని చూస్తే శుభ ఫలితాలు

HT Telugu Desk HT Telugu
Jun 15, 2023 01:08 AM IST

Today Rasi Phalalu: ఈరోజు 15.06.2023వ తేదీ కోసం రాశి ఫలాలను పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల దినఫలాలను ఇక్కడ చదవండి.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

ఈరోజు రాశి ఫలాలు: తేదీ 15.06.2023

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయనం,

మాసం: జ్యేష్టము, వారం: గురువారం,

తిథి: ద్వాదశి, నక్షత్రం: భరణి

మేషరాశి ఈరోజు రాశి ఫలాలు

మేషరాశి వారికి ఈ రోజు గురు ఛండాల యోగ ప్రభావం చేత చికాకులు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. శని అనుకూల స్థితి వలన ధన సంబంధిత విషయాల్లో అనుకూలంగా ఉన్నది. ఈరోజు శుభఫలితాలకు గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పటించాలి.

ఈనాటి వృషభరాశి ఫలితాలు

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రయాణాలు కలసివచ్చును. మానసికోల్లాసం పొందుతారు. అయితే ఖర్చులు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలని సూచన. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు ఉండును. దశమమునందు శని ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తాడు. ఈరోజు శుభఫలితాలకు దత్తాత్రేయుని పూజించాలి.

మిథునరాశి ఈరోజు దిన ఫలాలు

మిథున రాశి జాతకులకు వ్యయప్రయాసలు అధికం. ఓర్పుకు దగ్గరగా, గొడవలకు దూరంగా ఉండాలని సూచన. కుటుంబ వ్యవహారాల్లో చికాకులను సహనంతో దాటవేయాలి. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. ఈరోజు శుభఫలితాలకు శనగలు దానమివ్వాలి. బ్రాహ్మణులకు గానీ, ముత్తయిదువలకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి ప్రసాదంగా పంచిపెట్టాలి.

నేటి కర్కాటకరాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలం. కుటుంబ వ్యవహారాల్లో సహనం అవసరం. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు ఎదురవుతాయి. శుభఫలితాలకు గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

ఈరోజు సింహరాశి ఫలాలు

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలం. కుజ, శుక్రుల ప్రభావం చేత శరీర సౌఖ్యము లభిస్తుంది. దశమంలో రవి, బుధుల ప్రభావంచేత ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలం. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శుభఫలితాలకు దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి ఈరోజు రాశి ఫలాలు

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారపరంగా చేయు ప్రయత్నాలు లాభించును. కొంతకాలముగా ఎదురవుతున్న సమస్యల నుండి బయటకు వచ్చెదరు. లాభములో కుజ, శుక్రుల సంచారంచేత అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. అష్టమగురు రాహువు ప్రభావం చేత ఈ రాశివారికి పనులు యందు చికాకులు కలుగు సూచన. శనగలను ఆలయంలో నివేదించి ప్రసాదంగా పంచిపెట్టాలి.

ఈరోజు తులా రాశి ఫలితాలు

తులారాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలించును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త. అష్టమ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ తగదు. శుభఫలితాల కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి పోతాయి.

వృశ్చిక రాశి నేటి ఫలితాలు

వృశ్చిక రాశికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నవి. పని ఒత్తిళ్ళను తగ్గించుకునేందుకు ధ్యాన పద్ధతులు ఆచరించాలి. కుటుంబంలో కలతల విషయంలో ఓర్పుగా ఉండాలి. వాదనలకు దూరంగా ఉండాలి. శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవాలి. ఈరోజు శుభఫలితాలకు దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.

ధనూ రాశి ఈరోజు రాశి ఫలాలు

ధనూరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. పనుల యందు విజయము గోచరిస్తున్నది. సంతోషము, ఆనందము కలుగును. అష్టమ కుజ, శుక్రుల ప్రభావంచేత ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికి రాదు. లాభస్థానమునందు కేతువు, ఆరో స్థానమునందు రవి అనుకూల ప్రభావంచేత శత్రువులపై విజయము పొందెదరు. మరింత శుభఫలితాలకు శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి ప్రసాదంగా పంచిపెట్టాలి.

ఈరోజు మకర రాశి ఫలాలు

మకర రాశి జాతకులు ఈ రోజు పొదుపు పాటించాలి. ఏలినాటి శని అంత్య భాగము వలన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. కుటుంబ సౌఖ్యం, సమాజములో మర్యాద లభించను. ఈరోజు మరింత శుభఫలితాలకు గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించండి.

కుంభ రాశి ఈనాటి రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలముగా లేదు. పనుల యందు ఆటంకములు, చికాకులు ఉంటాయి. శత్రుత్వములు పెరగకుండా చూసుకోవాలి. ధనపరమైనటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.

ఈనాడు మీన రాశి ఫలితాలు

మీన రాశి జాతకులకు ఈ రోజు అనుకూలముగా ఉన్నది. అయితే పొదుపు పాటించాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కుటుంబ సభ్యులతో ఓర్పుగా వ్యవహరించాలి. గురు ఛండాల యోగ ప్రభావంచేత వాగ్వివివాదాలకు, చర్చలకు దూరంగా ఉండాలని సూచన. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి దానిని ప్రసాదంగా పంచిపెట్టాలి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ 9494981000

WhatsApp channel