Lord krishna: కృష్ణాష్టమి రోజు గర్భిణీలు కీరదోసకాయను ప్రసాదంగా తీసుకోవాలని ఎందుకు చెబుతారు?-cucumber has special importance on krishna janmashtami it is beneficial for pregnant women ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Krishna: కృష్ణాష్టమి రోజు గర్భిణీలు కీరదోసకాయను ప్రసాదంగా తీసుకోవాలని ఎందుకు చెబుతారు?

Lord krishna: కృష్ణాష్టమి రోజు గర్భిణీలు కీరదోసకాయను ప్రసాదంగా తీసుకోవాలని ఎందుకు చెబుతారు?

Gunti Soundarya HT Telugu
Aug 24, 2024 12:49 PM IST

Lord krishna: కృష్ణాష్టమి రోజు కీర దోసకాయను ప్రసాదంగా తీసుకోవాలని చాలా మంది నమ్ముతారు. అసలు కృష్ణుడికి, కీరదోసకాయకు ఉన్న సంబంధం ఏంటి? జన్మాష్టమి రోజు కీరదోస తినమని ఎందుకు చెబుతారు? దీని వెనుక నమ్మకాలు ఏంటో తెలుసుకుందాం.

కృష్ణుడికి కీరదోసకు సంబంధం ఏంటి?
కృష్ణుడికి కీరదోసకు సంబంధం ఏంటి?

Lord krishna: హిందూ మతంలో కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం, శ్రీ కృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్ట్ 26 న కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. 

ఈ రోజున శ్రీ కృష్ణుని బాల రూపాన్ని అంటే లడ్డూ గోపాలుడిని పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. జన్మాష్టమి నాడు శ్రీ కృష్ణ భగవానుని ఆరాధనలో దోసకాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాండ దోసకాయలను జన్మాష్టమి పూజలో ఉపయోగిస్తారు.

దోసకాయను బొడ్డు తాడులా భావిస్తారు

జన్మాష్టమి రోజు కృష్ణుడికి సమర్పించే నైవేద్యాలలో వివిధ రకాల వస్తువులను ఉంచుతారు. ఇందులో వెన్న, కొత్తిమీర పంజిరి, పంచామృతం, లడ్డూ ఉన్నాయి. చాలా చోట్ల కీర దోసకాయను కూడా ఉంచుతారు. దీన్ని కట్ చేయడం అంటే కృష్ణుడి బొడ్డు తాడు కోయడంగా భావిస్తారు. 

ఉత్తర భారతదేశంలోని చాలా చోట్ల కృష్ణుడు దోసకాయల నుంచి జన్మించాడని నమ్ముతారు. అందుకే పూజలో కాడతో కూడిన కీరదోసకాయను ఉంచుతారు. పూజ తర్వాత నాణెంతో కాడను కోసి కీరదోసను వేరు చేస్తారు. ఇలా చేయడం వల్ల కృష్ణుడు దేవకీ గర్భం నుంచి వేరు అవుతాడని నమ్ముతారు. ఆ తర్వాత శంఖం ఊదీ కృష్ణుడికి స్వాగతం పలుకుతారు. కొన్ని చోట్ల కీరదోసకాయను మధ్య నుంచి కోసి అందులో కృష్ణుడి బాల రూపాన్ని ఉంచుతారు. తర్వాత ఆ కీరదోసకాయను కృష్ణుడికి ప్రసాదంగా సమర్పిస్తారు. జన్మాష్టమి నాడు దోసకాయ కోయడం అంటే బాల్ గోపాల్‌ని దేవకీ మాత గర్భం నుండి వేరు చేయడంగా భావిస్తారు. 

పూజ చేసిన తర్వాత ఈ కీరదోసను అందరికీ ప్రసాదంగా పంచుతారు. గర్భిణీ స్త్రీలు ఈ కోసిన దోసకాయను ప్రసాదంగా తీసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. సంతానం కలగాలంటే జన్మాష్టమి నాడు కీరదోసకాయను ప్రసాదంగా తినాలని నమ్ముతారు.

గర్భిణీలకు మేలు 

తల్లి బొడ్డు తాడు నుంచే బిడ్డకు పోషకాలు అందుతాయి. చాలా చోట్ల ఇంట్లో గర్భిణులకు జన్మాష్టమి రోజు కిరదోసకాయ ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. శాస్త్రీయ కోణంలో కూడా గర్భిణులకు కీరదోసకాయ ఎంతో మేలు చేస్తుంది. శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. కీరదోసకాయలో విటమిన్ సి, ఏ, కె, కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. 

ఇది మాత్రమే కాదు జన్మాష్టమి నాడు సమర్పించే నైవేద్యాలన్నీ గర్భిణీల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మఖన్ మిశ్రీ, ఖీర్, కొత్తిమీర పంజిరి, పంచామృతం ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.