Betel Leaves in Hinduism: సైంటిఫికల్‌గా, శాస్త్రీయంగా ది బెస్ట్ అనిపించుకున్న మొక్కలలో తమలపాకు టాప్‌లో ఉంటుంది. ఎన్నో ఔషద గుణాలు, ఎన్నో పవిత్రమైన చరిత్ర ఉన్న ఈ ఆకులను పవిత్రమైన ఆచారాలలోనూ వినియోగిస్తుంటారు. హిందూ పురాణాల ప్రకారం చూస్తే, తమలపాకు మహిమాన్వితమైనది, శుభప్రదమైనది, జీవితాల్లోకి శ్రేయస్సును కూడా తెచ్చిపెట్టేది. అసలు తమలపాకు రూపంలోనే ఎన్నో దివ్యమైన శక్తులు కొలువై ఉన్నాయని చెబుతుంటారు. తమలపాకు చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి, లోపల విష్ణువు, బయట చంద్రుడు, మూలల్లో శివుడు, బ్రహ్మ ఉంటారని చెబుతారు. తమలపాకు తోక చివర జ్యేష్ఠ భగవతి, కుడివైపు పార్వతి, ఎడమవైపు భూమి, ఇంద్రుడు, ఆదిత్యుడు, పైభాగంలో ఇంద్రుడు, కామదేవుడు ఇలా ఆకులో అన్ని వైపులా దేవుళ్లు కొలువై ఉన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, తమలపాకులు త్రిమూర్తుల చిహ్నం అంతేకాదు లక్ష్మీదేవి చిహ్నం.
తమలపాకులో మరే ఆకులోనూ లేని ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఐశ్వర్యానికి చిహ్నంగా తమలపాకులను ఇంట్లో నాటడం కూడా మంచిది. నిత్య దేవతలు కొలువుండే తమలపాకు మొక్కను నాటడం, దానిని సంరక్షించుకోవడం ద్వారా ఇంట్లో నిత్యం ఐశ్వర్యం కొలువై ఉంటుందని నమ్ముతారు. అందుకే తమలపాకు మొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
తమలపాకుతో శుభాలు:
ప్రతి నెల పౌర్ణమి నాడు నిండు చంద్రుడు కనిపించే సమయానికి ఇంటి ప్రధాన ద్వారానికి తమలపాకుల దండలు వేలాడుతూ ఉండటం మంచిది. దీని వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.ఆంజనేయుడి ఎంతో ప్రీతికరమైన తమలపాకులు ఇంటికి ఉంటే ఆయన అనుగ్రహం కూడా లభిస్తుందట. తమలపాకులను మాలగా సమర్పించి హనుమంతుడిని ప్రార్థించడం వల్ల శనిదోష శాంతి కలుగుతుందని నమ్మకం. తమలపాకును దేవుడి వద్ద లేదా ఇంట్లో ఉంచే సమయంలో లక్ష్మీదేవి నివాసమైన ఆకు పైభాగాన్ని దక్షిణం లేదా పడమర వైపు తిప్పవద్దు. శుభం కోసం తెచ్చిన తమలపాకులు వాడిపోయేంత వరకూ ఉంచుకోకండి. ఒకవేళ అలా తెచ్చిన తమలపాకులు చిరిగిపోయినట్లయితే వాటిని విప్పకుండానే ఇంట్లో నుంచి తీసేయాలి. నూతన వధూవరులు సైతం తమలపాకులు, నాణేలతో దక్షిణ సమర్పించి పెద్దల నుంచి ఆశీర్వచనాలు అందుకుంటారు. ఇది హిందూ మతంలో ముఖ్యమైన ఆచారం కూడా. ఇలా దక్షిణ ఇచ్చే సమయంలో తమలపాకు తోకను దాత వైపుగా ఉంచి ఇవ్వడం మరిచిపోవద్దు.
ముఖ్యంగా ఇంటి నైరుతి మూల లేదా తూర్పు వైపుగా ఉండేలా నాటుకోవడం మంచిది. ఈ మొక్క ఇంట్లోఉంటే సాక్షాత్తు లక్ష్మీ దేవి, హనుమంతుల అనుగ్రహం నిత్యం ఉంటుందట. ఈ మొక్క తీగ పొడవుగా పెరిగితే శనీశ్వరుడు ఇంట్లో ఉండడు అనే నానుడి కూడా ప్రచారంలో ఉంది. అంతే కాదు ఈ మొక్క ఉంటే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయట. బుధగ్రహం నుంచి అనుకూల ఫలితాలు వస్తాయట
తమలపాకులకు దక్కిన గౌరవం:
శ్రీ రామచంద్రుడి విజయాన్ని లంకలో ఉన్న సీతమ్మకు తెలియజేసింది ముందుగా హనుమంతుడేనట. ఆ వార్త విన్న సీతమ్మ తల్లి దగ్గర్లో ఉన్న తమలపాకులను తెంపుకుని హారమ్‌గా ధరించి తన సంతోషాన్ని వ్యక్తపరిచిందట. కొన్ని కథనాల ప్రకారం, తమలపాకు మొక్క కైలాసంలో శివపార్వతులు నాటిన మొక్క తమలపాకు అని చెప్తుంటారు. శ్రీ లలితా సహస్రనామంలోనూ అమ్మవారు తమలపాకులను క్రమం తప్పకుండా తింటారని సూచిస్తూ తాంబూలపూరితముఖిగా వర్ణిస్తుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్