Ayodhya deepotsav: అయోధ్య బాలరాముడి తొలి దీపావళి వేడుకలను ఇంట్లోనే కూర్చుని కనులారా ఇలా వీక్షించండి
Ayodhya deepotsav: ఈ ఏడాది అయోధ్య బాల రాముడు తన తొలి దీపావళి వేడుకలు జరుపుకోబోతున్నారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత వస్తోన్న తొలి దీపావళి ఇదే. ఈ సందర్భంగా అయోధ్యలో దీపోత్సవం ఏర్పాటు చేశారు. 28 లక్షలతో దీపాలు వెలిగించి గిన్నీస్ రికార్డు సృష్టించబోతున్నారు.
శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో దీపావళి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ ఏడాది అయోధ్య బాల రాముడి తొలి దీపావళి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
లంకాధిపతి రావణుడిపై యుద్ధంలో విజయం సాధించి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకుని శ్రీరాముడు, సీత, లక్ష్మణులు అయోధ్య విచ్చేసిన సందర్భంగా దీపావళి వేడుకలు జరుపుకుంటారు. సుమారు 500 సంవత్సరాల తర్వాత తొలిసారిగా శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో బాల రాముడు దీపావళి వేడుకలు చేసుకోబోతున్నారు. రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతున్న తొలి వేడుకలు ఇవి. అందుకే ఈ దీపావళి మరింత ప్రత్యేకంగా ఉండేందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
అయోధ్య దీపోత్సవం
అయోధ్యలోని సరయూ తీరంలోని ఘాట్లలో 28 లక్షల దీపాలను వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా దీపావళి సందర్భంగా అయోధ్యలో దీపోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది వరుసగా ఎనిమిదవ సంవత్సరం. అయోధ్యలో నిర్మించిన రామాలయంలో ప్రత్యేక దీపం కూడా వెలిగించబోతున్నారు. ఇప్పటికే ఆలయం సర్వాంగ సుందరంగా దీపాల వెలుగుతో ముస్తాబైంది.
రామ్ లల్లా కోసం జరుపుకోబోతున్న తొలి దీపావళికి పర్యావనర అనుకూల దీపాలు వెలిగించబోతున్నారు. సరయూ నదిలోని 55 ఘాట్లలో 28 లక్షల దీపాలను వెలిగించేందుకు 30 వేల మందికి పైగా వాలంటీర్లు పాల్గొంటారు. అయోధ్యకు వెళ్ళి ఈ దీపోత్సవం చూడలేని వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దూరదర్శన్ తో పాటు సోషల్ మీడియాలో ఈ దీపోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు.
అయోధ్య రామాలయం మొత్తం అందంగా పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండే పర్యావరణ పరిరక్షణ దీపాలను వెలిగించనున్నారు. ఈ దీపాల వల్ల ఆలయంలో ఎటువంటి మరకలు, మసి లేకుండా ఉంటాయి. ఎక్కువ సేపు వెలుతురు అందిస్తాయి. దీపోత్సవంలో భాగంగా గతేడాది 51 ఘాట్లలో దీపాలు వెలిగించారు. ఈ ఏడాది 55 ఘాట్లలో దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 30న దీపోత్సవ కార్యక్రమం జరగనుంది. ఒకేసారి లక్షల దీపాలు వెలిగించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పాలని నిర్వాహకులు భావిస్తున్నారు. దీపోత్సవం రోజున రామ్ కీ పైడి గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు.
రాముడి కోసం ప్రత్యేక దుస్తులు
అయోధ్యలో కొలువు దీరిన రామాలయంలో బాల రాముడు దీపావళి పండుగ రోజు ప్రత్యేక దుస్తుల్లో భక్తులకు కనువిందు చేయబోతున్నారు. బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా శ్రీరాముడు, లక్షణుడి కోసం ప్రత్యేకంగా సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా దుస్తులు రూపొందిస్తున్నట్టు శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు ఒకరు వెల్లడించారు.
విదేశీ కళాకారులతో రామ్ లీలా
దీపోత్సవ కార్యక్రమంలో ఆరు దేశాలకు చెందిన కళాకారులు రామ్ లీలా ప్రదర్శించబోతున్నారు. మయన్మార్, నేపాల్, థాయ్ లాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియాకు చెందిన కళాకారులు ప్రదర్శన ఇవ్వబోతున్నారు.