Ashwayuja Masam: ఆశ్వయుజ మాసం రాబోతోంది.. మాసం ఉండే తేదీలు, విశిష్టత, పండగల వివరాలివిగో
Ashwayuja Masam Start Date: నక్షత్రాలలో మొదటిది అశ్విని నక్షత్రం. ఆ అశ్విని నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగిన మాసం ఆశ్వయుజ మాసం. ఈ మాసంలో అమ్మవారికి చేసే పూజా ఫలంతో అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
Ashwayuja Masam 2024: హిందువుల పండుగలో నవరాత్రులకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కృతిలో విలక్షణమైనవి. ఆశ్వయుజి అంటే స్త్రీమూర్తి, దేవి అని అర్థం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు అతి దగ్గరగా అశ్విని నక్షత్రానికి ఉండటంతో ఈ మాసాన్ని ఆశ్వయుజ మాసం అని పిలుస్తారు. ఈ ఏడాది ఆశ్వయుజ మాసం అక్టోబరు 3వ తేదీ ప్రారంభమై నవంబరు 1వ తేదీ ముగుస్తుంది.
ఏడాదిలో రెండు నవరాత్రులు విశేషంగా హిందువులు చేస్తారు. ఒకటి ఉత్తరాయణంలో చైత్ర నవరాత్రులు, మరొకటి ఆశ్వయుజంలో శరన్నవరాత్రులు. ఈ రెండు నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైనవి. మరీ ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి చేసే నవరాత్రుల పూజా ఫలంతో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు సౌభాగ్య సిద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు.
అమ్మవారు రాహు గ్రహానికి, కుజగ్రహానికి అధిపతి. కాబట్టి నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించడం ద్వారా కుజ దోషాలతో పాటు రాహుకేతు దోషాలు కూడా తొలిగిపోతాయి. నవరాత్రులలో 9 రోజులు నిష్టతో అమ్మవారిని ఆరాధిస్తే సౌభాగ్య ప్రాప్తి, లక్ష్మీ కటాక్షం, దాంపత్య సౌఖ్యం, దీర్ఘాయుషు కలుగుతుందని భక్తుల నమ్మకం.
అక్షరాభ్యాసానికి అనువైన రోజు
ఆశ్వయుజ మాసంలో 7వ రోజు సరస్వతీ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆరోజు అమ్మవారి సమక్షంలో పిల్లలకి తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఈ మాసంలోనే అష్టమిని దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. ఆ రోజు దుర్గాదేవి అమ్మవారిని ఆరాధిస్తే ఆరోగ్యసిద్ధి, సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది.
ఆశ్వయుజ మాసంలో బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుస్తూ.. అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారు. ఈ మాసంలో వచ్చే ద్వాదశిని గోవత్స ద్వాదశి అని పిలుస్తారు. ఆ రోజు దూడతో ఉన్న ఆవుని పూజిస్తారు.
ఈ మాసంలో వచ్చే బహుళ తదియను అట్లతదియగా పిలుస్తారు. బహుళ త్రయోదశిని.. ధన త్రయోదశి అంటారు. ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తుంటారు.
తెలంగాణలో బతుకమ్మ సంబరాలు
ఉత్తరాది వాళ్లు రామలీలా ఉత్సవాలను చేస్తే.. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలను ఈ 9 రోజులపాటు నిర్వహిస్తారు. ఏటా పితృ పక్షం ముగియగానే దేవతారాధన మొదలవుతుంది.ఆదిపరాశక్తి అమ్మవారిని త్రిమాతా రూపంగా ఆరాధించడం ఆశ్వయుజ మాసం విశిష్టత
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.