Pawan Kalyan : నేను ఏ హీరోతో పోటీ పడను, అభిమానుల కోరిక నాకు తెలుసు - పవన్ కల్యాణ్
Pawan Kalyan : రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, కంపౌండ్ వాల్స్, పాఠశాలల్లో రూఫ్ టాప్స్ ఇలా 30 వేల అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ఉపాధి హామీ నిధులు వస్తాయని పవన్ తెలిపారు.
(1 / 7)
"నేను అందరూ హీరోలు బాగుండాలని కోరుకుంటాను. నేను ఎవ్వరితో పోటీ పడను, ప్రతీ ఒక్కరికీ వారిదంటూ ఒక శైలి ఉంది" అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తనకు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్ బాబు, రామ్ చరణ్, తారక్, నాని, అల్లు అర్జున్... ఇలా ప్రతీ హీరో ఇష్టమే అన్నారు. వారి సినిమాలు విజయం సాధించాలని, అభిమానులు ఆనందపడాలని కోరుకుంటానన్నారు.
(2 / 7)
సినిమాలు చూడాలంటే ముందు జనం దగ్గర సంపాదన ఉండాలి అని, అది సృష్టించడం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల ప్రారంభోత్సవంలో పవన్ పాల్గొన్నారు. పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
(3 / 7)
'అభిమానుల కోరిక కూడా నాకు తెలుసు, నాకు ప్రజల సమస్యల పరిష్కారం ఎక్కువ ఆనందం ఇస్తుంది. మీ సమస్యల పరిష్కారంతో పాటుగా మీ ఆనందం కూడా ముఖ్యమే, నేను మరింత బలంగా పనిచేయాలన్నా, ఎవరికైనా సహాయం చేయాలంటే నాకున్న ఆర్థిక మార్గం సినిమాలు ఒక్కటే. తీరిక సమయంలో చూసుకుని మిమ్మల్ని ఆనందింప చేస్తాను' అని పవన్ కల్యాణ్ అన్నారు.
(4 / 7)
ఇవాళ పంచాయతీరాజ్ శాఖ రూ.4,500 కోట్ల వ్యయంతో పనులు చేపడుతుందంటే... అధికారులతో పాటుగా కూటమి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల సహకారం చాలా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే 5 ఏళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ఆకాంక్ష అన్నారు.
(5 / 7)
ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం రాష్ట్రాభివృద్ధికి కీలకం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు. ప్రతీ పంచాయతీలో ఏం పనులు జరుగుతున్నాయనేది ప్రజలకు తెలియాలని, ప్రతీ పంచాయతీ కార్యాలయంలో సిటిజన్ నాలెడ్జ్ బోర్డ్ ఏర్పాటు చేసి వివరాలు తెలియపరుస్తున్నామన్నారు.
(6 / 7)
సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రానికి నిధులు వస్తాయని పవన్ కల్యాణ్ తెలిపారు. దీని ద్వారా నైపుణ్యం లేని వ్యక్తులకు ఉపాధి అందించే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి 15 రోజుల్లో పనికల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో 43 గ్రామాల్లో నీటి సమస్యను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు బూతులు, శాపనార్థాలు తప్ప ఈ నీటి సమస్య గురించి పట్టించుకోలేదన్నారు. వెంటనే గ్రామీణ నీటి సరఫరా అధికారులు ప్రతీ గ్రామానికి టీమ్స్ పంపించి నీటి నాణ్యత పరిశీలించి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తుంచారు.
(7 / 7)
గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, కంపౌండ్ వాల్స్, పాఠశాలల్లో రూఫ్ టాప్స్, గోకులం నిర్మాణాలు, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సమస్యను తీర్చడం, పారిశుద్ధ్య పనులు, ఇతర 30 వేల అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసి సంక్రాంతి లోపు పూర్తి చేసేలా పనిచేయనున్నామని ప్రకటించారు.
ఇతర గ్యాలరీలు