WPI inflation : హోల్ సేల్ ఆధారిత ద్రవ్యోల్భణం 15.88 శాతానికి పెరుగుదల-wpi inflation spikes to record 15 88 percent in may on costlier food items crude oil ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Wpi Inflation : హోల్ సేల్ ఆధారిత ద్రవ్యోల్భణం 15.88 శాతానికి పెరుగుదల

WPI inflation : హోల్ సేల్ ఆధారిత ద్రవ్యోల్భణం 15.88 శాతానికి పెరుగుదల

HT Telugu Desk HT Telugu
Jun 14, 2022 02:39 PM IST

మే నెలలో హోల్‌సేల్ ప్రైస్ ఆధారిత ద్రవ్యోల్భణం రికార్డు స్థాయిలో 15.88 శాతానికి పెరిగింది.

మే నెలలో హోల్ సేల్ ఆధారిత ద్రవ్యోల్భణంలో రికార్డుస్థాయి పెరుగుదల (ప్రతీకాత్మక చిత్రం)
మే నెలలో హోల్ సేల్ ఆధారిత ద్రవ్యోల్భణంలో రికార్డుస్థాయి పెరుగుదల (ప్రతీకాత్మక చిత్రం) (AFP)

న్యూఢిల్లీ, జూన్ 14: ఆహార ఉత్పత్తులు, క్రూడాయిల్‌పై ధరల పెరుగుదల కారణంగా హోల్‌సేల్ ఆధారిత ద్రవ్యోల్భణం (డబ్ల్యుపిఐ) మే నెలలో రికార్డుస్థాయిలో 15.88 శాతానికి పెరిగింది. 

టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 15.08 శాతంగా ఉండగా, గతేడాది మేలో 13.11 శాతంగా ఉంది.

‘ప్రధానంగా మినరల్ ఆయిల్స్, ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఆహార ఉత్పత్తులు, ప్రాథమిక లోహాలు, ఆహారేతర వస్తువులు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా మే నెలలో ద్రవ్యోల్బణం రేటు అధికంగా ఉంది..’  అని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

గత ఏడాది ఏప్రిల్ నుంచి వరుసగా 14వ నెలలో డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో కొనసాగుతోంది. వరుసగా మూడు నెలలుగా పెరుగుతూ వస్తోంది.

కూరగాయలు, గోధుమలు, పండ్లు, బంగాళదుంపల ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే భారీగా పెరగడంతో మేలో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 12.34 శాతంగా ఉంది.

కూరగాయల ధరల పెరుగుదల రేటు 56.36 శాతం, గోధుమలు 10.55 శాతం, గుడ్లు, మాంసం, చేపల ధరల పెరుగుదల రేటు 7.78 శాతంగా ఉంది.

ఇంధనం, విద్యుత్తులో ద్రవ్యోల్బణం 40.62 శాతంగా ఉండగా, తయారీ ఉత్పత్తులు, నూనె గింజలలో ఇది వరుసగా 10.11 శాతం, 7.08 శాతంగా ఉంది.

మే నెలలో ముడి పెట్రోలియం, సహజవాయువు ద్రవ్యోల్బణం 79.50 శాతంగా ఉంది.

మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.04 శాతంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగా ఉండడం వరుసగా ఐదో నెల కావడం గమనార్హం.

అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ తన కీలక వడ్డీ రేటును మేలో 40 బేసిస్ పాయింట్లు, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు పెంచింది.

సెంట్రల్ బ్యాంక్ గత వారం 2022-23కి ద్రవ్యోల్బణం అంచనాను 100 బేసిస్ పాయింట్లు పెంచి 6.7 శాతానికి పెంచింది.

IPL_Entry_Point

టాపిక్