Kedarnath Yatra: ఉత్తరాదిని వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మృతి చెందారు. వర్షాలు, వరదల కారణంగా కేదార్ నాథ్ (Kedarnath) యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు.
యూపీ, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలు భారీ వర్షాలతో విలవిలలాడుతున్నాయి. వరద బీభత్సంతో ఆయా రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడడంతో ప్రధాన రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలు సహాయ చర్యలను కూడా అడ్డుకుంటున్నాయి. కేదార్ నాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో, 9 మంది యాత్రికులు మృతి చెందారు. వారిలో గంగోత్రి నేషనల్ హైవేపై కొండచరియలు విరిగి పడి 4 చనిపోయారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి కారణాలతో ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ యాత్రను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేశారు. చార్ ధామ్ యాత్రికులను సోన్ ప్రయాగ (Sonprayag), గౌరి ఖుండ్ (Gaurikund) ల వద్ద ఆపివేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడ్తున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో రాష్ట్రంలో నాలుగు ప్రధాన రహదారులు, 10 కనెక్టింగ్ రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం కూడా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఉత్తారాఖండ్ లోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ చర్యలకు సన్నద్ధమయ్యాయి. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో ఇలా కొండచరియలు విరిగిపడడం, నదులకు వరదలు రావడం జరుగుతూనే ఉంటుందని, అందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని ఉత్తరాఖండ్ సీఎం ధామి తెలిపారు. సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహకారం కూడా తీసుకుంటున్నామని వెల్లడించారు.