Toyota Crown car: అంతర్జాతీయ మార్కెట్లోకి టయోట క్రౌన్ కారు
Toyota Crown car: జపాన్‌లో దుమ్ము రేపు టయోటా క్రౌన్ కారు ఇప్పుడు అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లోకి రానుంది
టోక్యో: జపాన్‌లో టయోటా ఫ్లాగ్‌షిప్ మోడల్ క్రౌన్ (Crown) కారు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
‘క్రౌన్ శ్రేణి కార్లు జపాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమ్మాలని నిర్ణయించినందుకు చాలా సంతోషంగా ఉంది..’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అకియో టయోడా శుక్రవారం విలేకరులకు వెల్లడించారు.
16వ జనరేషన్ క్రౌన్ కార్లు జనవరిలో ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. నాలుగు వెరైటీల్లో ఈ క్రౌన్ శ్రేణి కార్లు అందుబాటులోకి వస్తాయి. జపాన్ వీధుల్లో ఇప్పుడు కనిపించే క్రౌన్ కార్లను పోలిన సెడాన్, హైబ్రిడ్ సిస్టమ్, ఎస్‌యూవీ, వాగన్ క్రాస్‌ఓవర్ ఎస్టేట్ కార్లు అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది.
టయోటా మోటార్ కార్పొరేషన్ ద్వారా మొత్తంగా 40 దేశాల్లో క్రౌన్ కార్ల అమ్మకాలు చేపట్టనున్నట్టు టయోటా కంపెనీ తెలిపింది. వార్షిక గ్లోబల్ సేల్స్ లక్ష్యం 2 లక్షలని తెలిపింది. ఈ శ్రేణిలో చవకైన కారు 4.35 మిలియన్ యెన్ (31 వేల డాలర్లు.. ఇండియా కరెన్సీలో ఇంచుమించు రూ. 25 లక్షలు) అని తెలిపింది.
జపాన్‌లో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన టయోటా ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 కోటి వాహనాలు అమ్ముతుంది. లగ్జరీ కార్ల శ్రేణిలో ప్రపంచవ్యాప్తంగా లెక్సస్ కార్లు అమ్ముతోంది. ఈ శ్రేణిలో కార్లు యూఎస్‌లో తక్కువలో తక్కువగా 35 వేల డాలర్లకు ( సుమారు రూ. 28 లక్షలు) లభ్యమవుతాయి.
ఆధునిక జపాన్ ఆర్థిక వ్యవస్థ, టయోట ఎదుగుదలకు సమాంతరంగా క్రౌన్ చరిత్ర ఉంటుంది. జపాన్‌లో 1955లో తొలిసారి ఈ కారు మార్కెట్లో అమ్ముడైంది. ‘సమ్ డే ఏ క్రౌన్’ అన్న ట్యాగ్ లైన్‌తో ఉంటుంది. కానీ విదేశాల్లో ఈ కార్లకు అంతగా పేరు లేదు.
టయోటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టయోడా మాట్లాడుతూ ‘క్రౌన్ జపాన్‌కు గర్వకారణం..’ అని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా క్రౌన్‌ను ఇష్టపడితే అంతకు మించిన సంతోషం ఏదీ లేదని టయోడా అన్నారు.