‘Person of the Year’ Zelensky: టైమ్ పర్సన్ ఆఫ్ ది ఈయర్.. జెలెన్ స్కీ
Time person of the year: 2022 సంవత్సరానికి గానూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Volodymyr Zelensky) ని ‘పర్సన్ ఆఫ్ ది ఈయర్’ గా టైమ్ మేగజీన్ ప్రకటించింది.
Time person of the year: ఆక్రమణకు దిగిన రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ( Zelensky)ని టైమ్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఈయర్ గా ప్రకటించింది. ప్రతీ సంవత్సరం ఒక వార్తల్లో నిలిచిన వ్యక్తిని టైమ్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఈయర్ గా ప్రకటించి, పత్రికలో ఆ వ్యక్తిపై ప్రత్యేక కథనాలను ప్రచురిస్తుంది.
Russia Ukraine war: రష్యా, ఉక్రెయిన్ వార్
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది. ఉక్రెయిన్ నాటోలో చేరే ప్రయత్నాలను అడ్డుకోవడం, రష్యన్ల ఆధిపత్యం ఉన్న ప్రాంతాలను రష్యాలో చేర్చుకోవడం, ఉక్రెయిన్ లో రష్యా అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా రష్యా ఈ దాడి ప్రారంభించింది.
Russia Ukraine war: ఊహించని ఎదురు దాడి
అయితే, రష్యా దాడిని ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంది. కొన్ని వారాల్లోనే యుద్ధం ముగుస్తుందన్న రష్యా అంచనాను తలక్రిందులు చేస్తూ.. రష్యాకు చుక్కలు చూపిస్తోంది. ఫిబ్రవరి నుంచి హోరాహోరీగా సాగుతున్న యుద్ధంలో రష్యా దళాలకే ఎక్కువ ప్రాణనష్టం జరిగిందని సమాచారం. అమెరికా, బ్రిటన్, ఇతర యూరోప్ దేశాల పరోక్ష సహకారంతో ఉక్రెయిన్ రష్యాను దీటుగా ఎదుర్కొంటోంది.
Time person of the year: జెలెన్ స్కీ సమర్ధ నాయకత్వం
రష్యా యుద్ధాన్ని ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కోవడం వెనుక ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ(Volodymyr Zelensky) ఉన్నారు. ఆయన స్ఫూర్తిదాయక నాయకత్వంలో ఉక్రెయిన్ దళాలు వీరోచితంగా పోరాడుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో జెలెన్ స్కీ దేశాన్ని విడిచి పారిపోయాడన్న వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలు నిరాధారమని నిరూపిస్తూ, జెలెన్ స్కీ(Zelensky) ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఉండడమే కాకుండా, యుద్ధం జరుగుతున్న ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. రష్యా దళాలను విజయవంతంగా వెనక్కు పంపిన ఖెర్సన్ పట్టణంలో స్వయంగా ఉక్రెయిన్ దళాలతో కలిసి బహిరంగంగా సంబరాలు చేసుకున్నారు. ఈ పర్సన్ ఆఫ్ ది ఈయర్ ను ప్రకటించే సంప్రదాయాన్ని టైమ్ మేగజీన్ 1927లో ప్రారంభించింది. గత సంవత్సరం ఈ టైటిల్ ను టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ కు ప్రకటించింది.