Indian Techie drowns in US: యూఎస్ లో నదిలో కొట్టుకుపోయి ఇండియన్ టెక్కీ దుర్మరణం-texted mother hours before tragedy techie from maharashtra drowns in us ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Techie Drowns In Us: యూఎస్ లో నదిలో కొట్టుకుపోయి ఇండియన్ టెక్కీ దుర్మరణం

Indian Techie drowns in US: యూఎస్ లో నదిలో కొట్టుకుపోయి ఇండియన్ టెక్కీ దుర్మరణం

HT Telugu Desk HT Telugu
Jul 12, 2024 08:17 PM IST

భారత్ కు చెందిన ఐటీ నిపుణుడు సిద్ధాంత్ విఠల్ పాటిల్ అమెరికాలో స్నేహితులతో కలిసి గ్లేసియర్ నేషనల్ పార్క్ లో హైకింగ్ కు వెళ్లి ప్రమాదవశాత్తూ అక్కడి నదిలో కొట్టుకుపోయాడు. ఎంత వెతికినా అతని మృతదేహం లభ్యం కాలేదు. అయితే, అతడు మరణించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.

Siddhant Vitthal Patil
Siddhant Vitthal Patil (Reddit: Old_Potato9157)

భారత్ లోని మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ఐటీ ఉద్యోగి స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు అమెరికాలోని మోంటానా రాష్ట్రంలోని ప్రసిద్ధ గ్లేసియర్ నేషనల్ పార్క్ లో నదిలో కొట్టుకుపోయాడు. అతడు కాలిఫోర్నియాలో పనిచేస్తుండేవాడు. అతడిని సిద్ధాంత్ విఠల్ పాటిల్ గా గుర్తించినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ తెలిపింది.

నదిలో పడిపోయి..

ఐటీ ప్రొఫెషనల్ అయిన పాటిల్ జూన్ 6న అవలాంచె లేక్ ట్రైల్ లో లోయపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా పెద్ద బండరాయిపై జారి కింద లోయలో వేగంగా ప్రవహిస్తున్న నదిలో పడిపోయాడు. తడిగా ఉన్న రాయిపై నుంచి జారిపడి ఉంటాడని భావిస్తున్నారు. అతనితో పాటు ఉన్న స్నేహితులు పాటిల్ లోయలో నదీ ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని చూశారు.

మృతదేహం దొరకలేదు..

పాటిల్ మృతదేహం లభ్యం కాలేదని, అయితే అతను చనిపోయినట్లు భావిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. హెలికాఫ్టర్లు ఏరియల్ సెర్చ్ నిర్వహించాయని, డ్రోన్లతో కూడా గాలింపు జరిపామని, అయితే మృతదేహం ఆనవాళ్లు లభించలేదని తెలిపారు. లోతైన లోయలోని నీటి ప్రవాహంలో ఎక్కడైనా చెట్లు, రాళ్లు వంటి చోట మృతదేహం చిక్కుకుపోయి ఉండవచ్చని రేంజర్లు అనుమానిస్తున్నారు. మృతదేహం కోసం గాలిస్తున్న రేంజర్లకు పాటిల్ కు చెందిన కొన్ని వ్యక్తిగత వస్తువులు లభించాయి.

స్టడీస్ కు వెళ్లి..

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ (యూసీఎల్ఏ) లో ఎంఎస్ చేయడానికి పాటిల్ 2020లో అమెరికా వెళ్లారు. ఎంఎస్ పూర్తయిన తరువాత 2023లో క్యాడెన్స్ కంపెనీలో చేరాడు. పాటిల్ కాలిఫోర్నియాలో ఉంటూ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు.

అమ్మకు టెక్స్ట్ మెసేజ్

ఈ విషాద సంఘటన జరగడానికి రెండు గంటల ముందు అతను తన తల్లికి మెసేజ్ చేశాడు. మరో మూడు రోజుల్లో తాను కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ లో పనిచేసిన శాన్ జోస్ కు తిరిగి వస్తానని ఆ మెసేజ్ లో తన తల్లికి చెప్పాడు. పాటిల్ తల్లిదండ్రులు ప్రీతి, విఠల్ లు మహారాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ లో ఉద్యోగులుగా ఈ మే నెలలోనే రిటైర్ అయ్యారు. ఈ ప్రమాదం గురించి తెలిసిననాటి నుంచి వారు మాట్లాడే స్థితిలో లేరని పాటిల్ మేనమామ చౌదరి అన్నారు.

Whats_app_banner