California heat wave: కాలిఫోర్నియా అంతటా తీవ్రమైన వేడి నెలకొన్నది. మండే వేడికి తోడు వడ గాలులు అక్కడి ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హాలీడే వీక్ లో కాలిఫోర్నియా వాసులను ఈ ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేస్తున్నాయి.
తీవ్రమైన వేడి, వడగాల్పుల కారణంగా కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలో కార్చిచ్చు ప్రారంభమయ్యే ముప్పు పొంచి ఉంది. మంటలను నివారించడానికి విద్యుత్ లైన్లను మూసివేయవలసి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. మంగళవారం 12,000 ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయవచ్చని పీజీ అండ్ ఈ కార్ప్ తెలిపింది. వీటిలో ఎక్కువ భాగం ఉత్తర, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. కాలిఫోర్నియా ప్రాంతంలో 100 డిగ్రీల ఫారెన్ హీట్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే, తీవ్రమైన వేడితో వడ గాలులు వీస్తున్నాయి. విద్యుత్ తీగల నుంచి ఎండిపోయిన గడ్డిలోకి నిప్పులు చిమ్మకుండా చూసేందుకు రూపొందించిన ఆటోమేటిక్ షట్ ఆఫ్ లను ఆన్ చేశారు.
అమెరికా (USA) లోని కాలిఫోర్నియా (California heat wave) లోని సెంట్రల్ వ్యాలీ, పశ్చిమ పసిఫిక్ తీరం వరకు ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉన్నాయి.ఈ ప్రాంతవాసులకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్లు యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. శాక్రమెంటోలో గరిష్ట ఉష్ణోగ్రత సోమవారం 104 ఎఫ్ (40 సి) కు చేరుకుంటుంది. బుధవారం 111 ఎఫ్ కు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 1991 లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలకు ఒక డిగ్రీ దూరంలో ఉంటుంది. బుధవారం నుండి శనివారం వరకు, యుఎస్ అంతటా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. కాలిఫోర్నియాలో వేసవిలో గడ్డి ఎండిపోతుంది. ఎండిపోయిన చెట్లు, గడ్డితో కార్చిచ్చులు ప్రారంభమయ్యే ప్రమాదం ఉంది. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ ప్రకారం, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,696 కార్చిచ్చులు 118,149 ఎకరాలను దగ్ధం చేశాయి.