Pune Porsche accident: ‘‘భయం వేసింది..’’ - రోడ్డు భద్రతపై వ్యాసం సమర్పించిన పుణె పోర్షే యాక్సిడెంట్ నిందితుడు
పుణె పోర్షే ప్రమాదంలో నిందితుడైన 17 ఏళ్ల మైనర్ జువెనైల్ జస్టిస్ బోర్డుకు రోడ్డు భద్రతపై 300 పదాల్లో వ్యాసం రాసి సమర్పించాడు. ఆ వ్యాసంలో ప్రమాద బాధితులకు సహాయం అందించాల్సిన అవసరాన్ని ఆ మైనర్ ప్రస్తావించాడు. యాక్సిడెంట్ చేసిన తరువాత భయం వేసి అక్కడి నుంచి పారిపోవాలనుకున్నానని తెలిపాడు.
Pune Porsche accident: సంచలనం సృష్టించిన పుణె పోర్షే ప్రమాదానికి కారణమైన 17 ఏళ్ల మైనర్ బుధవారం జువెనైల్ జస్టిస్ బోర్డుకు రోడ్డు భద్రతపై ఒక వ్యాసాన్ని సమర్పించాడు. యాక్సిడెంట్ చేసిన తరువాత నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి విషయం తెలియజేయడానికి బదులుగా పారిపోవడానికి ప్రయత్నించానని, తప్పించుకోవడానికి భయమే తనను ప్రేరేపించిందని అతను రాశాడని జువెనైల్ జస్టిస్ బోర్డుకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వ్యాసంపై వివాదం..
అర్ధరాత్రి, తప్పతాగి, లగ్జరీ కారు పోర్షేలో అతివేగంతో ఒక బైక్ ను ఢీ కొట్టి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన ఆ బాలుడికి స్థానిక జువనైల్ కోర్టు.. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే బెయిల్ మంజూరు చేయడం వివాదానికి కారణమైంది. బెయిల్ ఇవ్వడానికి షరతుగా ఆ న్యాయమూర్తి.. రోడ్డు భద్రతపై 300 పదాల్లో ఒక వ్యాసం రాసి ఇవ్వాలని ఆదేశించడం కూడా వివాదాస్పదమైంది. అంత తీవ్రమైన నేరానికి వెంటనే, అదీ చిన్న షరతుతో, బెయిల్ ఇవ్వడం సరికాదని విమర్శలు వచ్చాయి. నిందితుడి తండ్రికి ఉన్న రాజకీయ సంబంధాల కారణంగానే జేజేబీ ఆ నిందితుడి పట్ల సున్నితంగా వ్యవహరిస్తోందని చాలా మంది ఆరోపించారు.
వ్యాసం రాసిన బాలుడు
అయితే, బెయిల్ షరతును పాటిస్తూ, ఆ యాక్సిడెంట్ చేసిన బాలుడు రోడ్డు భద్రతపై 300 పదాల్లో ఒక వ్యాసం రాసి బుధవారం జువెనైల్ జస్టిస్ బోర్డుకు సమర్పంచాడు. అందులో యాక్సిడెంట్ చేసిన సమయంలో తన మానసిక స్థితిని వివరించాడు. ప్రమాద బాధితులకు వెంటనే సహాయం అందించాల్సిన అవసరాన్ని ఆ టీనేజర్ ఆ వ్యాసంలో ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మే నెలలో పుణెలో జరిగిన ఈ యాక్సిడెంట్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
పోలీసుల అదుపులో బాలుడి తండ్రి, తాత
పుణెలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్, బ్రహ్మ రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యజమాని విశాల్ అగర్వాల్ మైనర్ కుమారుడు మే 19 తెల్లవారుజామున తన తండ్రికి చెందిన, రిజిస్టర్ కాని పోర్షే టైకాన్ కారును, మద్యం మత్తులో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ, బైక్ పై వెళ్తున్న అనీష్ అవధియా(24), అశ్విని కోస్తా(24) అనే ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో వారిద్దరు అక్కడికక్కడే చనిపోయారు. బాలుడి రక్త నమూనాలను తారుమారు చేసిన కేసులో విశాల్ అగర్వాల్, అతని తండ్రి పోలీసుల అదుపులో ఉన్నారు.