Ukraine Crisis | యుద్ధంలో నేను సైతం.. ఉక్రెయిన్‌ బలగాల్లో తమిళ విద్యార్థి-tamilnadu student sainikesh joined in ukraine forces to fight against russia ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ukraine Crisis | యుద్ధంలో నేను సైతం.. ఉక్రెయిన్‌ బలగాల్లో తమిళ విద్యార్థి

Ukraine Crisis | యుద్ధంలో నేను సైతం.. ఉక్రెయిన్‌ బలగాల్లో తమిళ విద్యార్థి

Hari Prasad S HT Telugu
Mar 08, 2022 02:33 PM IST

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంలో నేను సైతం అంటూ ఓ తమిళనాడు విద్యార్థి ఆయుధాలు పట్టాడు. యుద్ధం ముగిసిన తర్వాతే ఇండియా వస్తానంటున్నాడు.

<p>ఉక్రెయిన్ బలగాలతో సైనికేష్&nbsp;</p>
ఉక్రెయిన్ బలగాలతో సైనికేష్ (Twitter)

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచీ ఎంతమంది భారతీయులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని స్వదేశానికి వచ్చారో మన చూశాం. ఆపరేషన్‌ గంగా పేరుతో ఇప్పటికే ఎన్నో వేల మందిని భారత ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. ఇప్పటికే ఓ విద్యార్థి ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంకెంతో మంది యుద్ధభూమి సుమీ నగరంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. 

అయితే ఓ తమిళనాడు విద్యార్థి మాత్రం తాను ఉక్రెయిన్‌ను వదిలి రానంటున్నాడు. అంతేకాదు ఏకంగా ఉక్రెయిన్‌ తరఫున ఆయుధం కూడా చేత పట్టుకున్నాడు. రష్యాపై యుద్ధానికి సై అంటున్నాడు. అతని పేరు సైనికేష్‌ రవిచంద్రన్‌. 21 ఏళ్ల ఈ విద్యార్థిది తమిళనాడులోని కోయంబత్తూరు. ఖార్కివ్‌లోని నేషనల్‌ ఏరోస్పేస్‌ యూనివర్సిటీలో చదవడానికి 2018లో అతను అక్కడికి వెళ్లాడు. 

ఇప్పుడు యుద్ధం ప్రారంభమైన తర్వాత అందరూ ఎప్పుడెప్పుడు ఆ దేశం వదిలి ప్రాణాలతో బయటపడతామా అని ఎదురు చూస్తే.. ఈ సైనికేష్‌ మాత్రం ఆ దేశం తరఫున పోరాటానికి సిద్ధమయ్యాడు. తాను ఉక్రెయిన్‌ పారామిలిటరీ బలగాల్లో చేరినట్లు ఈ మధ్యే తన కుటుంబానికి సైనికేష్‌ చెప్పడం గమనార్హం. ఈ విషయం తెలిసి అధికారులు కోయంబత్తూరులోని అతనికి ఇంటికి వెళ్లి ఆరా తీశారు. 

నిజానికి గతంలో ఓసారి ఇండియన్‌ ఆర్మీలో చేరడానికి సైనికేష్‌ ప్రయత్నించినట్లు అధికారుల విచారణలో తేలింది. అయితే అప్పట్లో అతను ఆర్మీ పరీక్షల్లో ఎంపిక కాలేకపోయాడు. తర్వాత 2018లో ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్‌ వెళ్లిపోయాడు. 2022 జులైతో అతని కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే అంతలోపే ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైంది. ఆర్మీలో చేరాలన్న ఆసక్తి ముందు నుంచీ ఉండటంతో ఇక ఇప్పుడు స్వదేశానికి రాకుండా ఉక్రెయిన్‌ తరఫున యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ యుద్ధం మొదలైన తర్వాత సైనికేష్‌తో అతని కుటుంబం కొన్ని రోజుల పాటు మాట్లాడలేకపోయింది. అక్కడి ఎంబసీ సాయంతో మొత్తానికి అతనితో మాట్లాడగలిగారు కుటుంబ సభ్యులు. అయితే తాను అక్కడి పారామిలిటరీలో చేరానని చెప్పడంతో వాళ్లు షాక్‌ తిన్నారు.

జెలెన్‌స్కీ పిలుపు మేరకు..

నిజానికి యుద్ధం ప్రారంభమైన మూడు రోజుల తర్వాత విదేశీ పౌరులు కూడా వలంటీర్లుగా పాల్గొనాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. దీంతో వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇండియాతోపాటు అమెరికా, బ్రిటన్‌, స్వీడన్‌, మెక్సికోలాంటి దేశాల పౌరులు కూడా ఉన్నట్లు ఉక్రెయిన్‌ బలగాలు వెల్లడించాయి. సైనికేష్‌ కూడా ఇలాగే ఉక్రెయిన్‌ బలగాల్లో చేరాడు.

భారత చట్టాలు ఏం చెబుతున్నాయి?

అయితే భారత చట్టాల ప్రకారం ఓ భారత పౌరుడు విదేశం తరఫున యుద్ధంలో పాల్గొనడం నేరం. మరో దేశంలో జరిగే ఎలాంటి పోరాటం లేదా యుద్ధంలో పాల్గొనడానికి భారత పౌరులకు అనుమతి లేదు అని 2015లో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ఓ అఫిడవిట్‌లో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అప్పట్లో ఇరాక్‌లోని ప్రార్థనా మందిరాలను కాపాడుకోవడానికంటూ ఇండియా నుంచి ఓ షియా గ్రూపు అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించింది. మరో దేశ యుద్ధంలో పాల్గొనడానికి వలంటీర్లను మొబిలైజ్‌ చేయడం కచ్చితంగా భారత చట్టాలకు విరుద్ధమని, అది దేశ విధానాలను ఉల్లంఘించడమే అవుతుందని ఆ అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్