Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారతాన్ని వణికించిన భూప్రకంపనలు.. అఫ్గాన్‍లో భూకంపం: 9 మంది మృతి!
Earthquake: ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి విపరీతంగా కంపించింది. దీంతో ప్రజలు భవనాల నుంచి పరుగుపరుగున బయటికి వచ్చారు. అఫ్గానిస్థాన్‍లో భూకంపం సంభవించటంతో భారత్‍లో భూమి కంపించింది.
Earthquake: భూప్రకంపనలతో ఉత్తర భారతం (Strong Tremors in India) వణికిపోయింది. ఢిల్లీ(Delhi)తో పాటు చాలా ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూమి తీవ్రంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భవనాల నుంచి రోడ్ల మీదికి పరుగెత్తారు. రెండు నిమిషాల పాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి. అఫ్గానిస్థాన్‍లో తీవ్ర భూకంపం (Afghanistan Earthquake) సంభవించడంతో ఇలా ఇండియాలోనూ భూమి కంపించింది. ఈ భూకంపం వల్ల అఫ్గాన్‍తో పాటు పాకిస్థాన్‍లోనూ ప్రాణనష్టం సంభవించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలివే.
Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‍లోని హిందూ కుష్ (Hindu Kush) ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే భూకంప కేంంద్రం వెల్లడించింది. అఫ్గాన్‍లోని జుర్మ్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో, 187.6 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడిందని పేర్కొంది.
ఈ భూకంపం ప్రభావం పాకిస్థాన్‍పై కూడా ఎక్కువగానే పడినట్టు తెలుస్తోంది. అలాగే ఇండియా, ఖజకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, కిర్గిస్థాన్‍లోనూ భూమి కంపించింది.
భూకంపం వల్ల అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‍లో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్టు సమాచారం బయటికి వచ్చింది.
పరుగులు తీసిన ప్రజలు
Earthquake: భారత్‍లోని దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో భూమి విపరీతంగా కంపించింది. జమ్ముకశ్మీర్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‍లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించటంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. భవనాలు సెకన్ల పాటు ఊగాయి. దీంతో తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ట్వీట్ చేశారు. ఢిల్లీలో భూమి కంపించిందని, అందరూ సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
ఇంట్లో ఫ్యాన్ హఠాత్తుగా ఊగటంతో భూప్రకంపనలను గుర్తించినట్టు నోయిడాలోని హైడ్ పార్కు వద్ద నివాసం ఉంటున్న ఓ వ్యక్తి చెప్పారు. భూమి ఎక్కువసేపు కంపించిందని, తీవ్రంగానే అనిపించిందని చెప్పారు.
కారు వణికింది
తాను ప్యాసింజర్ల కోసం వేచిచూస్తున్న సమయంలో భూమి కంపించటంతో ఒక్కసారిగా తన కారు వణికిందని ఓ క్యాబ్ డ్రైవర్ చెప్పారు. “నేను ప్యాసింజర్ల కోసం వేచిచూస్తున్న సమయంలో కారు ఒక్కసారి వణకడం ప్రారంభించింది. నేను వెంటనే గట్టిగా అరిచాను. నా స్నేహితులను అప్రమత్తం చేశాను” అని సెంట్రల్ ఢిల్లీకి చెందిన రమేశ్ అన్నారు.
తాను టీవీ చూస్తుండగా భూమి కంపించిందని, ఒక్కసారిగా సోఫా వణికిందని లాజ్‍పత్ నగర్లో నివాసం ఉంటున్న జ్యోతి చెప్పారు. ముందుగా తాను దాన్ని పట్టించుకోలేదని, అయితే తన భర్త చెప్పటంతో ఒక్కసారిగా బయటికి వచ్చేశామని అన్నారు. ఇలా ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. వేలాది మంది ప్రజలు భయంతో భవనాల నుంచి బయటికి వచ్చారు.