Sri Lanka Latest: పదవుల నుంచి తప్పుకోనున్న శ్రీలంక అధ్యక్ష, ప్రధానులు-sri lanka latest president pm to resign after chaotic protests ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sri Lanka Latest: పదవుల నుంచి తప్పుకోనున్న శ్రీలంక అధ్యక్ష, ప్రధానులు

Sri Lanka Latest: పదవుల నుంచి తప్పుకోనున్న శ్రీలంక అధ్యక్ష, ప్రధానులు

HT Telugu Desk HT Telugu
Jul 10, 2022 08:59 AM IST

ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని విక్రమ సింఘెలు దిగిరాక తప్పలేదు. తమ పదవులకు రాజీనామా చేయాలని అధ్యక్ష, ప్రధానులు నిర్ణయించారు. శ్రీలంక సంక్షోభానికి పాలకులే కారణమని నిందిస్తూ వేలాది మంది అధ్యక్ష భవనంతో పాటు ప్రధాని నివాసాలపై దాడులు చేయడంతో పదవుల్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. జులై 13న అధ్యక్షుడితో పాటు ప్రధాని రాజీనామాలు చేయనున్నారు.

శ్రీలంక అధ్యక్ష భవనం ఎదుట ఆందోళనలు
శ్రీలంక అధ్యక్ష భవనం ఎదుట ఆందోళనలు (REUTERS)

పదవులకు రాజీనామా చేసేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో పాటు ప్రధాని విక్రమ సింఘెలు సిద్ధమయ్యారు. ప్రజాగ్రహంతో శ్రీలంక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. శనివారం తలెత్తిన పరిణామాలతో ఖంగుతున్న నేతలు వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలు శనివారం తారాస్థాయికి చేరాయి. ప్రజల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో నాయకులు ప్రాణభయంతో పరారయ్యారు. రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కొద్ది నెలలుగా జరుగుతున్న ఆందోళనలు శనివారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించే వరకు వెళ్లాయి. ప్రజాందోళనల్ని ఖాతరు చేయకుండా దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేలా గొటబాయ వ్యవహారిస్తూ వచ్చారు. దేశమంతా కొలంబోకు తరలి రావాలనే పిలుపుతో శనివారం అధ్యక్ష భవనానికి వెల్లువెత్తారు.

శనివారం నాటి పరిణామాలతో ఖంగుతిన్న అధ్యక్షుడు రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. బుధవారం పదవి నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం ఇచ్చారు. అధికార బదలాయింపు సాఫీగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు పార్లమెంటు స్పీకర్ ప్రకటించారు. ఆందోళనకారులు ముట్టడికి భయపడి అధ్యక్ష భవనాన్ని విడిచి పారిపోయిన రాజపక్స ఎక్కడున్నారనే సంగతి ఇంకా తెలియలేదు. మరోవైపు ఆందోళన కారులు ప్రధాని విక్రమసింఘె నివాసానికి నిప్పు పెట్టారు. అయితే ప్రధాని సురక్షితంగానే ఉన్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

మరోవైపు శ్రీలంకలో నెలకొన్న సంక్షోభ పరిణామాలతో అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులు అక్కడ నెలకొన్న పరిణామాలను పరిష్కరించేందుకు ఆర్ధిక శాఖతో పాటు సెంట్రల్ బ్యాంకుతో చర్చలు జరుపుతున్నారు. శ్రీలంకనను ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు అవసరమైన సహకారం అందించనున్నట్లు ఐఎంఎఫ్‌ ప్రకటించింది. ఆర్థిక సంక్షోభ కారణంగా పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో శ్రీలంకను ఆదుకోవాల్సిన అవసరముందని ఐఎంఎఫ్‌ అభిప్రాయపడింది. ఇరుపక్షాలకు అమోదయోగ్యమైన ప్రణాళిక కోసం శ్రీలంకతో కలిసి పనిచేస్తున్నట్లు ఐఎంఎఫ్‌ ప్రకటించింది.

మరోవైపు రాజపక్స రాజీనామా నిర్ణయంతో ఆందోళన కారులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు ప్రజలు శాంతియుతంగా ఉండాలని శ్రీలంక సైన్యం పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది. గత నెలలో శ్రీలంక సాయుధ దళాల అధిపతిగా బాధ్యతలు చేపట్టిన రాజపక్స అనుచరుడు జనరల్ శివేంద్ర సిల్వ ఆందోళనలు విరమించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో శాంతి స్థాపనకు సహకరించాలని కోరారు.

జులై 13న ప్రస్తుత అధ్యక్షుడితో పాటు ప్రధాని తమ పదవుల్ని వదులుకోనున్నారు. పార్టీ నేతల అభ్యర్థనతో పదవుల నుంచి వైదొలగేందుకు అంగీకరించినట్లు స్పీకర్ మహిందయప అభేయవర్దేన ప్రకటించారు. జులై 13న అధికారాల బదలాయింపుకు అధ్యక్షుడు అంగీకరించినట్లు ప్రకటించారు. తన నిర్ణయాన్ని దేశ ప్రజలకు తెలియచేయాల్సిందిగా స్పీకర్‌ను అధ్యక్షుడు కోరినట్లు తెలిపారు.

IPL_Entry_Point

టాపిక్