AAP Telangana | రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనుందా?
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు మెల్లిమెల్లిగా దక్షిణ భారతదేశంలోనూ పాగా వేయాలని భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం నుంచే తొలి అడుగు పడబోతందనే సంకేతాలు వస్తున్నాయి.
New Delhi | తెలంగాణలో ఇప్పట్లో ఎన్నికలు అనేవి ఏమీ లేకపోయినా ఒక అనివార్యమైన రాజకీయ వేడి రాష్ట్రంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీని లక్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలపై ఫోకస్ పెంచారు. ఒకవైపు రాష్ట్రంలో తెరాస- బీజేపీ- కాంగ్రెస్ నడుమ త్రిముఖ పోరు సాగుతున్న సందర్భంలో ఇప్పుడు మరొకరు ఎంటర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దిల్లీ, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు మెల్లిమెల్లిగా దక్షిణ భారతదేశంలోనూ పాగా వేయాలని భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం నుంచే తొలి అడుగు పడబోతుందనే సంకేతాలు వస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణపై ఆప్ అధిష్టానం త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహించి తెలంగాణ వ్యూహాన్ని ఖరారు చేయనునట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణలో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం ఈ పార్టీ ప్రారంభించింది. 2023 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో ఆప్ తరఫున పోటీ చేసేందుకు సత్తా గల నాయకులను అణ్వేషించే పనిలో పడింది. పలు నివేదికలు వెల్లడించిన సమాచారం ప్రకారం, రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సుమారు 35-40 స్థానాల్లో పోటీ చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందని చెప్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కేసీఆర్ పాలనతో విసిగిపోయారని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇలాగే ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేదు.. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులపై ప్రజలకు విశ్వాసం లేదని ఆప్ భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలోని యువత, నిరుద్యోగుల సమస్యలు లక్ష్యంగా.. పార్టీ ప్రణాళికను త్వరలో రూపొందించన్నట్లు వార్తలు అందుతున్నాయి.
ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే అనుకున్నా.. సీఎం కేసీఆర్ సంకల్పించిన యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్ నినాదానికి దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతల నుంచి మద్ధతు లభిస్తుంది. అయితే అలాంటి రాజకీయాలే కోరుకుంటున్న ఆప్ నుంచి మాత్రం ఇంతవరకు అలాంటి మద్ధతేమి కేసీఆర్‌కు లభించలేదు. ఇదే నిజమైతే కేసీఆర్ సంకల్పించిన ఫెడరల్ ఫ్రంట్ గుంపులో కేజ్రీవాల్ ఉండే అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కేజ్రీవాల్ ఎలాంటి క్రేజీ నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాలి.