Snapchat: తాలిబన్ సభ్యుడినని స్నాప్ చాట్ లో సరదా మెసేజ్; చిక్కుల్లో భారతీయ విద్యార్థి-snapchat text that landed uk student into trouble i am a member of the taliban ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Snapchat: తాలిబన్ సభ్యుడినని స్నాప్ చాట్ లో సరదా మెసేజ్; చిక్కుల్లో భారతీయ విద్యార్థి

Snapchat: తాలిబన్ సభ్యుడినని స్నాప్ చాట్ లో సరదా మెసేజ్; చిక్కుల్లో భారతీయ విద్యార్థి

HT Telugu Desk HT Telugu
Jan 25, 2024 05:30 PM IST

Snapchat: తన స్నేహితులకు సరదాగా పంపించిన స్నాప్ చాట్ సందేశం ఒక భారతీయ విద్యార్థిని పోలీస్ స్టేషన్ కు వెళ్లేలా చేసింది. అంతేకాదు, లక్షలాది రూపాయలు జరిమానా కట్టే పరిస్థితి ఏర్పడింది. ఆ సందేశంలో 'విమానాన్ని పేల్చివేయడానికి వెళ్తున్నాను. నేను తాలిబన్ సభ్యుడిని' అని రాసి ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Representational Image/Unsplash)

యూకేలోని బాత్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదువుతున్న, భారత సంతతికి చెందిన ఆదిత్య వర్మ.. తన స్నేహితులకు పంపిన స్నాప్ చాట్ మెసేజ్ పై స్పెయిన్ లో విచారణ ఎదుర్కొంటున్నాడు. 2022 జూలైలో వర్మ తన స్నేహితులతో కలిసి మెనోర్కా ద్వీపానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. తాను తాలిబన్ సభ్యుడినని, విమానాన్ని పేల్చివేస్తానని సరదాగా ఆ స్నాప్ చాట్ సందేశంలో పేర్కొన్నాడు.

సరదాగానే..

గాట్విక్ విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు అతను తన స్నేహితులకు సరదాగా పంపిన స్నాప్ చాట్ సందేశం ఇలా ఉంది: "విమానాన్ని పేల్చివేయడానికి నేను వెళుతున్నాను (నేను తాలిబన్ సభ్యుడిని). విమానాశ్రయ వై-ఫై నెట్వర్క్ ఈ సందేశాన్ని గుర్తించింది. యూకే అధికారులు ఇది అత్యంత ప్రమాదకరమైన చర్యగా భావించి వెంటనే స్పానిష్ అధికారులకు సమాచారం అందించారు.

ఫైటర్ జెట్స్ తోడుగా..

దీనికి ప్రతిస్పందనగా, స్పానిష్ వైమానిక దళం రెండు ఎఫ్ -18 జెట్లను విమానం మెనోర్కాలో ల్యాండ్ అయ్యే వరకు సహాయంగా పంపించింది. విమానాశ్రయం మెనోర్కాలో ల్యాండ్ అయ్యాక 18 ఏళ్ల వయసున్న ఆదిత్య వర్మను అరెస్టు చేశారు. రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలో గడిపిన ఆయన ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తరువాత, అతడు యూకేకు తిరిగి వెళ్లినప్పుడు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా ఆయనను ప్రశ్నించాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

ఆ స్నాప్ చాట్ మెసేజ్ ను సరదాగా మాత్రమే తన ఫ్రెండ్స్ కు పంపించానని ఆదిత్య వర్మ పోలీసులకు, ఆ తరువాత కోర్టుకు తెలిపాడు. నా ముఖ కవలికలు, లక్షణాల వల్ల స్కూల్ రోజుల నుంచి ఫ్రెండ్స్ నన్ను అలా పిలిచేవారు. దాంతో, జోక్ గా అలా పంపించాను. తాను ప్రయాణిస్తున్న విమానానికి రక్షణగా రెండు యుద్ధవిమానాలు రావడంపై.. "రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది కనుక భద్రతాచర్యల్లో భాగంగా అలా చేశారనుకున్నా’’ అని సమాధానమిచ్చారు.

కోర్టు విచారణ, భారీ జరిమానా

ఈ కేసులో మరికొద్ది రోజుల్లో కోర్టు తీర్పు వెలువరించనుంది. ఆదిత్య వర్మపై ఉగ్రవాద అభియోగాలు లేనప్పటికీ, నేరం రుజువైతే అతనికి 22,500 యూరోల (రూ.20 లక్షలకు పైగా) వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఖర్చుల కోసం స్పెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ 95,000 యూరోలు (రూ.80 లక్షలకు పైగా) కోరుతోంది.

IPL_Entry_Point