Ujjain rape: ‘‘నా కొడుకును కాల్చి పారేయండి’’- ఉజ్జయిన్ రేప్ నిందితుడి తండ్రి ఆగ్రహం
Ujjain rape: మధ్య ప్రదేశ్ లో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల బాలిక రేప్ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఆటో డ్రైవర్ భరత్ సోనీగా గుర్తించారు.
Ujjain rape: సెప్టెంబర్ 25వ తేదీన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ జిల్లాలో మహాకాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచారానికి (rape) గురై, రక్తమోడుతూ, వీధిలో స్థానికుల సాయం అడుగుతున్న 15 ఏళ్ల బాలిక వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
ఆటో డ్రైవర్
ఈ దారుణానికి పాల్పడింది ఆటో డ్రైవర్ భరత్ సోనీ అని పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. బాలిక తో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అతడు మాట్లాడుతున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారించగా, తానే ఆ దారుణానికి పాల్పడినట్లు భరత్ సోనీ తెలిపాడు. భరత్ సోనీకి సాయం చేసిన మరో ఆటో డ్రైవర్ రాకేశ్ మాలవీయ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఉరి తీయాలి..
ఈ దారుణంపై నిందితుడు భరత్ సోనీ తండ్రి రాజు సోనీ స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన తన కుమారుడిని కాల్చి చంపాలని లేదా ఉరి తీయాలని పోలీసులను కోరాడు. ఇలాంటి దారుణమైన నేరాలు చేసేవారిని పోలీసులు వెంటనే కాల్చి చంపేయాలని వ్యాఖ్యానించారు. ‘‘సిగ్గుతో చచ్చిపోతున్నా. నాకేం అర్థం కావడం లేదు. ఆ పాప నా కూతురు వంటిదే. నేను నా కొడుకు స్థానంలో ఉంటే, ఈ తప్పు చేసినందుకు ఉరేసుకుని చనిపోయేవాడిని’’ అన్నాడు. అలాంటి నేరాలు చేసినవారు ప్రాణాలతో ఉండడానికి అర్హులు కారు. బతికి ఉండే అర్హత వారికి లేదు. నా కొడుకైనా, మరెవరైనా, ఇలాంటి తప్పు చేస్తే కాల్చి చంపేయాలి.. లేదా ఉరి తీయాలి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద తప్పు చేసినప్పటికీ తన కొడుకులో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదన్నాడు.