Russia - Ukraine War: 600 మందిని చంపాం.. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాం: రష్యా ప్రకటన.. ఉక్రెయిన్ ఏమంటోందంటే!-russia ukraine war russia claims it killed over 600 ukrainian servicemen in kramatorsk ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Russia Ukraine War Russia Claims It Killed Over 600 Ukrainian Servicemen In Kramatorsk

Russia - Ukraine War: 600 మందిని చంపాం.. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాం: రష్యా ప్రకటన.. ఉక్రెయిన్ ఏమంటోందంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 08, 2023 11:21 PM IST

Russia - Ukraine War: ఉక్రెయిన్ దళాలపై భారీ క్షిపణి దాడికి పాల్పడినట్టు రష్యా ప్రకటించింది. ఈ దాడిలో 600 మందికిపైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయారని ప్రకటించింది. దీనికి ఉక్రెయిన్ కూడా స్పందించింది.

Russia - Ukraine War: 600 మందిని చంపాం.. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాం: రష్యా (ఫైల్ ఫొటో)
Russia - Ukraine War: 600 మందిని చంపాం.. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాం: రష్యా (ఫైల్ ఫొటో) (REUTERS)

Russia - Ukraine War: రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు, ప్రతీకారదాడుల పర్వం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఓవైపు ఉక్రెయిన్‍లో తిష్ట వేసి రష్యా (Russia) దళాలు దెబ్బ కొడుతున్నాయి. ఉక్రెయిన్ కూడా ఏ మాత్రం లొంగకుండా వీలైనప్పుడు ఎదురుదెబ్బ తీస్తోంది. ఇటీవల క్షిపణులతో విరుచుకుపడి రష్యా సైనికులపై దాడి చేసింది ఉక్రెయిన్ (Ukraine). దీని ప్రతీకారం తీర్చుకున్నామంటూ రష్యా తాజాగా ప్రకటన విడుదల చేసింది. భారీ దాడి చేశామని వెల్లడించింది. దీనిపై ఉక్రెయిన్ కూడా స్పందించింది. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

600మందికి పైగా చనిపోయారు

ఉక్రెయిన్‍ బలగాలు స్థావరంగా చేసుకున్న క్రామటోర్స్క్ (Kramatorsk)లోని భవనాలపై దాడి చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ దళాల బ్యారెక్‍లపై ఉక్రెయిన్ దళాలు చేసిన దాడికి ప్రతీకారంగానే ఇది చేసినట్టు వెల్లడించింది. తాము చేపట్టిన వైమానిక దాడిలో 600 మందికిపైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.

“ఓ హాస్టల్‍లో 700 మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నారని, మరో దాంట్లో 600 మంది ఉన్నారని మాకు సమాచారం అందింది. ఈ ఉక్రెయిన్ సైనిక తాత్కాలిక స్థావరాలపై మేం క్షిపణులతో భారీగా దాడి చేశాం. దీంట్లో 600 మందికిపైగా ఉక్రెయిన్ సైనికులు మృతి చెందారు” అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఒకవేళ రష్యా చెప్పిందే నిజమైతే, యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ దళాలకు ఒకేసారి ఇంత మొత్తంలో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి.

'రష్యా అబద్ధం చెబుతోంది'!

క్షిపణుల దాడితో తమ దేశానికి చెందిన వందలాది సైనికులను చంపినట్టు రష్యా అబద్ధపు ప్రచారం చేస్తోందని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా అలాంటి భారీ దాడి తాజాగా చేయలేదని పేర్కొంది.

కొత్త సంవత్సరం వేళ మకీవ్కాలో ఉన్న రష్యా స్థావరాలపై ఉక్రెయిన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 89 మంది సైనికులు మృతి చెందారని రష్యానే చెప్పింది. తమ సైనికులు అనుమతి లేకుండా ఫోన్లు వాడడంతోనే ట్రాక్ చేసిన ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడిందని ప్రకటించింది. దీనికి ప్రతీకారంగానే తాజాగా క్షిపణి దాడి చేశామని, 600 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయారని వెల్లడించింది. అయితే దీన్ని ఉక్రెయిన్ ఖండిస్తోంది.

రష్యా, ఉక్రెయిన్ మధ్య గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్‍లోని కొన్ని ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది. అక్కడే సైనిక బలగాలను మోహరించి దాడులను చేస్తోంది.

IPL_Entry_Point