అణ్వాయుధాలు సిద్ధం చేస్తున్న పుతిన్​​.. చర్చలకు ఉక్రెయిన్​ ఓకే!-russia ukraine talks zelensky agrees for talk as putin puts nuclear forces on high alert ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అణ్వాయుధాలు సిద్ధం చేస్తున్న పుతిన్​​.. చర్చలకు ఉక్రెయిన్​ ఓకే!

అణ్వాయుధాలు సిద్ధం చేస్తున్న పుతిన్​​.. చర్చలకు ఉక్రెయిన్​ ఓకే!

HT Telugu Desk HT Telugu
Mar 01, 2022 01:45 PM IST

Russia Ukraine talks | ఉక్రెయిన్​పై దండయాత్ర వేళ.. దేశ డిటర్రెన్స్​ ఫోర్స్​ను హై అలర్ట్​లో పెట్టారు రష్యా అధ్యక్షుడు పుతిన్​. అణ్వాయుధ దళానికి మరోపేరు డిటరెన్స్​ ఫోర్స్​. మరోవైపు బెలారస్​ సరిహద్దులో చర్చలకు ఉక్రెయిన్​ అంగీకరించినట్టు తెలుస్తోంది.

<p>రష్యా అధ్యక్షుడు పుతిన్​</p>
రష్యా అధ్యక్షుడు పుతిన్​ (via REUTERS)

Putin nuclear Ukraine | ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆదివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్​పై దాడి కోసం దేశ డిటర్రెన్స్​ ఫోర్స్​ హైఅలర్ట్​లో ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ పిలుపునిచ్చారు. అణ్వాయుధాలు కలిగిన దళాలకు మరో పేరే ఈ డిటర్రెన్స్​ ఫోర్స్​. కాగా ఇది బయటకొచ్చిన కొద్దిసేపటికే.. రష్యాతో చర్చలకు ఉక్రెయిన్​ సిద్ధమని మరికొన్ని వార్తలు వెలువడ్డాయి.

పుతిన్​ పిలుపు..

డిటర్రెన్స్​ ఫోర్స్​ను సిద్ధం చేయాలని రష్యా మిలిటరీకి స్పష్టం చేశారు పుతిన్​.

"నాటో నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తున్నారు. మన మీద కుట్రపూరితంగా చర్యలు చేపడుతున్నారు. వీటిని మనం చూస్తూనే ఉన్నాము," అని పుతిన్​ పేర్కొన్నారు.

పుతిన్​ పిలుపుపై ప్రపంచ దేశాధినేతలు మండిపడుతున్నారు.  

చర్చలకు సిద్ధం..

Ukraine invasion | బెలారస్​లో రష్యాతో చర్చలకు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. బెలారస్​ సరిహద్దులోని చెర్నోబిల్​ ప్రాంతంలో చర్చలకు వస్తామని పేర్కొన్నారు.

బెలారస్​ అధ్యక్షుడు అలెగ్జాండర్​ లుకషెంకోతో ఫోన్​లో మాట్లాడిన అనంతరం జెలెన్స్కీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక రష్యా విషయానికొస్తే.. ఉన్నతస్థాయి అధికారులు ఇప్పటికే బెలారస్​లో ఉన్నారు.

వాస్తవానికి.. బెలారస్​లో చర్చలు జరుపుదామని రష్యా అనేకమార్లు ప్రతిపాదించింది. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా దానిని ఉక్రెయిన్​ తిరస్కరించింది. రష్యాతో కలిసి తమపై దాడి చేస్తున్న దేశంలో ఎలా చర్చలు జరుపుతామని ప్రశ్నించింది. బెలారస్​ కాకుండా వేరే ఎక్కడైనా చర్చలకు వస్తామని తేల్చిచెప్పింది. ఆ తర్వాతి కొద్ది గంటలకే పరిస్థితుల్లో వేగంగా మార్పులు కనిపించాయి.

ఇదీ వివాదం..

Russia Ukraine conflict | కొన్నేళ్ల పాటు తీవ్రంగా ఉన్న రష్యా- ఉక్రెయిన్​ వివాదం.. కొన్ని నెలలుగా మరింత ముదిరింది. నాటోలో చేరాలని ఉక్రెయిన్​ చేస్తున్న ప్రయత్నాలపై రష్యా మండిపడింది. నాటోలో ఉక్రెయిన్​ చేరితే, ఆ దేశంపై ఆధిపత్యం చెలాయించడం కష్టమని భావించి.. వివాదాన్ని తీవ్రతరం చేసింది! రెండు నెలల వ్యవధిలో సరిహద్దుకు లక్షలాదిమంది బలగాలను, ఆయుధాలను పంపింది.

ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బైడెన్​ సహా యూరోపియన్​ యూనియన్​ దేశాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. అవి ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయాయి.

అయితే తమకు దాడి చేసే ఉద్దేశం లేదని రష్యా పదేపదే చెబుతూ వచ్చింది. ఈ తరుణంలోనే.. బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించింది. కాగా.. ఇతర దేశాలు రష్యా మాటలను విభేదించాయి. రష్యా చెప్పినట్టు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించడం లేదని చెప్పాయి. వాటి అంచనాలకు తగ్గట్టుగానే ఈ గురువారం.. ఉక్రెయిన్​పై రష్యా దాడి చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్