Rent through ICICI credit card: క్రెడిట్ కార్డ్ నుంచి రెంట్ చెల్లిస్తున్నారా?
Rent through ICICI credit card: ఐసీఐసీఐ క్రెడిట్ ద్వారా ఇంటి రెంట్ చెల్లిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..
Rent through ICICI credit card: ‘డియర్ కస్టమర్.. అక్టోబరు 20 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే అద్దెలపై 1 శాతం రుసుము వర్తిస్తుంది..’ అన్న మెసేజ్ నిన్న ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు వచ్చింది.
మీకు కూడా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉందా? ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చి ఉంటుంది. దీనర్థం ఏంటంటే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి క్రెడ్, రెడ్ జిరాఫీ, మైగేట్, పేటీఎం, మాజిక్ బ్రిక్స్ వంటి యాప్స్ ద్వారా ఇంటి అద్దె చెల్లిస్తున్నట్టయితే ఆ లావాదేవీపై 1 శాతం రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు రెంట్ చెల్లింపుపై ఏ ఇతర బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డు కంపెనీ రుసుము వసూలు చేయలేదు. అద్దె చెల్లింపు లావాదేవీలపై రుసుము వసూలు చేయాలని నిర్ణయించిన తొలి బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కావడం చెప్పుకోదగిన అంశం. ఐసీఐసీఐ బ్యాంక్‌ను చూసి ఇతర క్రెడిట్ కార్డు సంస్థలు కూడా అనుసరించే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు మీరు ఎలా చెల్లించారు?
మీరు అద్దె చెల్లింపు యాప్‌లో కిరాయిదారు (టెనెంట్) ఇంటి యజమాని బ్యాంక్ ఖాతా వివరాలు లేదా యూపీఐ చిరునామా ఫిల్ చేసి లావాదేవీలు పూర్తిచేసేవారు. ఆయా ప్లాట్‌ఫామ్స్ ఈ లావాదేవీలపై కన్వినియెన్స్ ఫీ రూపంలో 0.46 నుంచి 2.36 శాతం రుసుం వసూలు చేసేవి. మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) కు ఈ రుసుం ప్రత్యామ్నాయంగా ఉండేది. సాధారణంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ మర్చంట్స్ నుంచి ఎండీఆర్ వసూలు చేస్తాయి. యూజర్స్ కార్డుల ద్వారా బిల్ చెల్లింపులు చేసినప్పుడు ఈ ప్లాట్‌ఫామ్స్ ఎండీఆర్ వసూలు చేస్తాయి. అయితే ఇక్కడ మర్చంట్ ఇంటి ఓనర్ కాబట్టి అతను చెల్లించడు. అద్దె మాత్రం స్వీకరిస్తాడు. అందువల్ల ప్లాట్‌ఫామ్స్ యూజర్స్ నుంచి ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ వసూలు చేసే 1 శాతం రుసుము అదనం.
అద్దె చెల్లింపులపై ఎందుకు ఈ రుసుము?
ఈ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారో ఐసీఐసీఐ బ్యాంక్ చెప్పకపోయినప్పటికీ క్రెడిట్ రొటేషన్ పద్ధతి ద్వారా రెంట్ పేమెంట్ చేయడాన్ని ఈ అదనపు రుసుము నిరోధిస్తుందని బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
వినియోగదారులు ఇప్పుడు తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఈ ప్లాట్‌ఫామ్స్‌పై యాడ్ చేసి వారి ఖాతాల్లోకి నగదు చెల్లించే అవకాశం ఏర్పడుతుందని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. ఇందుకు అదనంగా పెద్దగా ఖర్చు కూడా ఉండదు. కానీ క్రెడిట్ కార్డు నుంచి ఏటీఎం ద్వారా మనీ విత్ డ్రా చేయాలంటే తడిసి మోపెడవుతుంది..
రెడ్ జిరాఫీ మినహా అనేక యాప్‌లు క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఈ లావాదేవీలు సరైనవేనా అని ధ్రువీకరించేందుకు వీలుగా అవి రెంట్ అగ్రిమెంట్ కూడా అడగవు.
‘బోగస్ రెంట్ పేమెంట్స్ ద్వారా క్రెడిట్ రొటేషన్ చేస్తున్న విధానాన్ని నిరోధించేందుకు ఈ రుసుము తెచ్చినట్టున్నారు. గతంలో బ్యాంకులు ట్రైన్ టికెట్స్ బుకింగ్‌పై 0.25 నుంచి 1.8 శాతం వరకు సర్‌ఛార్జీలు వసూలు చేసేవి. ఫ్యూయల్ పేమెంట్స్ పై కూడా ఇవి వర్తించేవి..’ అని ఢిల్లీ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కషిఫ్ అన్సారీ అన్నారు.