Nalini moves SC | సుప్రీంకోర్టుకు రాజీవ్ గాంధీ హంతకురాలు
1991లో జరిగిన రాజీవ్ గాంధీ హత్యలో దోషిగా తేలిన నళిని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే కేసులో దోషిగా కోర్టు నిర్ధారించిన పెరరివలన్‌ను జైలు నుంచి విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదే గ్రౌండ్స్‌పై తనను కూడా రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టును కోరారు.
Nalini moves SC | ఏజీ పెరరివలన్‌ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదల చేశారు. గతంలో పెరరివలన్‌ను విడుదల చేయాలని నాటి తమిళనాడు గవర్నర్‌కు రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు చేసింది. సాధారణంగా మంత్రిమండలి సిఫారసులను గవర్నర్ అమలు చేయాలి. కానీ గవర్నర్ తను నిర్ణయాన్ని తీసుకోకుండా, ఈ ప్రతిపాదనను రాష్ట్రపతికి పంపించారు. అప్పటి నుంచి అది అక్కడే పెండింగ్‌లో ఉండిపోయింది.
Nalini moves SC | పెరరివలన్ విడుదల
దీనిపై పెరరివలన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన సుప్రీంకోర్టు గవర్నర్ తీరును తప్పుపట్టింది. మంత్రిమండలి సిఫారసులను ఎందుకు అమలు చేయలేదని, నిర్ణయం తీసుకోవడానికి అంత సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. అనంతరం, 2022 మే నెలలో పెరరివలన్‌ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని 142 అధికరణ ద్వారా లభించిన అధికారంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Nalini moves SC | మాకూ అదే వర్తించాలి
ఈ నేపథ్యంలో రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన నళిని, రవిచంద్రన్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పెరరివలన్‌కు వర్తించిన న్యాయం తమకు కూడా వర్తిస్తుందని, అందువల్ల తమను కూడా విడుదల చేయాలని ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. గత 31 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయాన్ని వారు కోర్టుకు గుర్తు చేశారు. అయితే, పెరరివలన్ విడుదల విషయంలో సుప్రీంకోర్టు వినియోగించిన ఆర్టికల్ 142 అధికారాన్ని ప్రతీ సందర్భంలో వినియోగించడం కుదరదు.
Nalini moves SC | నళిని ఎవరు?
రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన దోషి. రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో ఆమె అక్కడే ఉంది. ఆ ఆత్మాహుతి దాడిలో రాజీవ్ సహా 22 మంది చనిపోయారు. అనంతరం జరిగిన దర్యాప్తులో ఆమె దోషిగా తేలారు. అయితే, 2021 నుంచి ఆమె మెడికల్ బెయిల్‌పై ఉన్నారు. ప్రస్తుతం విడుదల కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో మరో దోషి అయిన రవిచంద్రన్ కూడా 2021 నుంచి మెడికల్ బెయిల్‌పై ఉన్నారు. నళిని క్షమాభిక్షకు సంబంధించి రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ చేసిన ప్రకటన మేరకు.. నళినికి విధించిన మరణ శిక్షను 2000 సంవత్సరంలో యావజ్జీవ శిక్షగా మార్చారు.
Nalini moves SC | మొత్తం దోషులు..
ఈ కేసులో దోషులుగా తేలిన వారిలో రవిచంద్రన్, నళిని, పెరరివలన్ భారతీయులు. మిగతా వారైన మురుగన్, సంథన్, జయకుమార్, రాబర్ట్ పయాస్‌లు శ్రీలంకకు చెందిన ఎల్‌టీటీఈ సంస్థకు చెందిన వారు. వీరందరినీ దోషులుగా 1999లో సుప్రీంకోర్టు నిర్ధారించింది. వారిలో నళిని, పెరరివలన్ తో పాటు మొత్తం నలుగురికి మరణ శిక్ష, మిగతావారికి యావజ్జీవ శిక్ష విధించింది.