Houston shooting: యూఎస్ లో పొరుగింటివారిపై కాల్పులు; ఐదుగురి దుర్మరణం
Houston shooting: పొరుగింటి వారిపై ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటన అమెరికాలోని హ్యూస్టన్ లో చోటు చేసుకుంది.
Houston shooting: పొరుగింటి వారిపై ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటన అమెరికాలోని హ్యూస్టన్ లో చోటు చేసుకుంది.
Houston shooting: హ్యూస్టన్ లో..
తుపాకీతో తరచూ కాల్పులు జరుపుతూ నిద్రాభంగం కలిగిస్తున్న పొరుగింటి వ్యక్తిని, అలా చేయవద్దని కోరిన పాపానికి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సాన్ జేసింటో కౌంటీ పోలీస్ అధికారి గ్రెగ్ కేపర్స్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హ్యూస్టన్ కు ఉత్తరంగా 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లీవ్ ల్యాండ్ లోని ఒక ఇంట్లో హోండురస్ కు చెందిన ఒక కుటుంబం నివాసం ఉంటోంది. వారి ఇంటి పక్కన ఉండే వ్యక్తి తరచూ ఇంటి వెనుక భాగంలో తుపాకీతో కాల్పులు జరుపుతూ ఉండేవాడు. అదికూడా ఈ కుటుంబం నిద్రపోయే సమయంలో కాల్పులు జరుపుతుండేవాడు. దాంతో, అలా కాల్పులు జరపడం వల్ల నిద్రాభంగం అవుతోందని, అందువల్ల తుపాకీ కాల్పులను నిలిపేయాలని ఈ కుటుంబం అతడిని హెచ్చరించింది. దాంతో ఆగ్రహంతో ఆ వ్యక్తి ఈ కుటుంబంపై ఒక రోజు ఉదయమే వారి ఇంట్లోకి వెళ్లి తన దగ్గర ఉన్న ఏఆర్ రైఫిల్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. ఆ కాల్పుల్లో 8 ఏళ్ల చిన్నారి పాప సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇంట్లోని మరో ఇద్దరు పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం ఇద్దరు మహిళలు వారికి రక్షణగా ఆ పిల్లలపై పడుకుండిపోయి, అలాగే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్న పాప ఉన్నారు.