Muslim family makes Ravan effigies: రావణుడి బొమ్మ తయారు చేసేది ముస్లింలే..
Muslim family makes Ravan effigies: రామ్‌లీలా కోసం ఏటా రావణుడిని బొమ్మను తయారు చేసేది ఇక్కడ
ఆగ్రా, అక్టోబరు 4: ప్రతి ఏటా దసరాకు ఒక నెల ముందు 75 ఏళ్ల జాఫర్ అలీ తన కుటుంబంతో కలిసి లంకేశ్వరుడు రావణుడు, అతని సోదరుల బొమ్మలను తయారు చేసే బృహత్తర పనికి దిగుతారు.
హస్తకళాకారుల కుటుంబంలోని ఐదో తరానికి చెందిన అలీ మాట్లాడుతూ, ‘ఆగ్రాలోని రామ్‌లీలా కమిటీ సభ్యులు బొమ్మలను తయారు చేయడానికి మమ్మల్ని ఆహ్వానించారు. వివిధ సైజుల్లో బొమ్మలను తయారు చేయడానికి సుమారు ఒక నెల పాటు రామ్‌లీలా మైదానంలో ఉంటాం’ అని వివరించారు.
రాం లీలా కార్యక్రమం ముగింపు సందర్భంగా కమిటీ జాఫర్ అలీ, అతడి కుటుంబాన్ని కూడా సత్కరిస్తుంది.
చేతివృత్తికారుల్లో పెద్దవాడైన అలీ తన నైపుణ్యం గురించి మాట్లాడుతూ, ‘నేను నా చిన్నప్పటి నుండి ఇదే వృత్తిలో ఉన్నాను. ఇప్పుడు మా కుటుంబంలోని ఐదో తరం ఈ వృత్తిలో పని చేస్తోంది. మా తాత, తండ్రి కూడా ఇదే వృత్తిలో పనిచేశారు..’ అని వివరించారు. తన కుటుంబంలో 18 మంది సభ్యులు ఉన్నారని, అందరూ దిష్టిబొమ్మల తయారీలో నైపుణ్యం కలిగి ఉన్నారని తెలిపారు.
కోవిడ్-19 కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ సంవత్సరం రాంలీలాలో రావణుడి దిష్టిబొమ్మను సుమారు 100 అడుగుల పొడవుతో ఏర్పాటు చేస్తున్నారు. అతని సోదరులు కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలను కూడా వరుసగా 65, 60 అడుగుల పొడవుతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం దిష్టిబొమ్మల పరిమాణం భిన్నంగా ఉంటుంది.
‘రంగు రంగుల కాగితం, పురి తాళ్లు, తెల్లటి పిండి, వెదురు కర్రలతో దిష్టిబొమ్మలను పూర్తి చేయడానికి సుమారు ఒక నెల సమయం పడుతుంది’ అని అలీ చెప్పారు.
మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కోవిడ్ -19 తర్వాత తన కుటుంబం మళ్లీ ఈ పనులకు రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ‘ఈ సంవత్సరం ఆనందంగా ఉంది. మేం మా నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతున్నాం..’ అని అలీ అన్నారు.
బొమ్మల తయారీలో అలీకి సహాయపడే మరో కుటుంబ సభ్యుడు 45 ఏళ్ల ఔలి మాట్లాడుతూ ‘ఒక్కో కార్మికునికి వేతనాలు వేర్వేరుగా ఉంటాయి. రోజుకు రూ. 500-రూ. 700 వరకు ఉంటాయి. ఈ నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రాామాయణంలోని సన్నివేశం ప్రకారం 15 కంటే ఎక్కువ దిష్టిబొమ్మలు, ఇతర డిజైన్లను మేం తయారు చేశాం..’ అని వివరించారు.
అలీ, అతని మేనల్లుడు అమీర్ అహ్మద్ (50) తమ మతం కారణంగా ఎప్పుడూ ఎలాంటి వివక్షను ఎదుర్కోలేదని పేర్కొన్నారు. ‘ఇక్కడ ఎవరూ మమ్మల్ని వేరే మతానికి చెందిన వారిలా చూడరు. మేం మా ఇల్లులా పని చేస్తాం. మా కుటుంబాల పిల్లలు కూడా దసరా వేడుకలను చూడటానికి వస్తారు..’ అని చెప్పారు.
‘ఇక్కడి స్థానికులు మమ్మల్ని ప్రేమిస్తారు. అందుకే మా తాత, నాన్న, నేను ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి సంవత్సరం ఈ దిష్టిబొమ్మలను తయారు చేయడానికి ఇక్కడకు వస్తున్నాం..’ అని చెప్పారు.
ఒక శతాబ్దం క్రితం ప్రారంభమైన రాంలీలా జిల్లా ఆగ్రా నుండి మాత్రమే కాకుండా దాని సమీపంలోని మధుర, ఫిరోజాబాద్ జిల్లాల నుండి కూడా సందర్శకులను ఆకర్షిస్తుంది.
రాంలీలా కమిటీ అధ్యక్షుడు, నార్త్ ఆగ్రా ఎమ్మెల్యే పురుషోత్తం ఖండేల్వాల్ మాట్లాడుతూ ‘ఇది శతాబ్దపు నాటి ఆనవాయితీ. ఆగ్రాలోని రావత్‌పరాలో లాలా కోకమల్ తొలుత దీనిని ప్రారంభించారు. ఆ తర్వాత ఇది ఆగ్రా కోట సమీపంలోని రామ్‌లీలా మైదానానికి మారింది. ఇది ఆగ్రాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక కార్యక్రమం..’ అని వివరించారు.
‘రామ్‌లీలా, రామ్ బారాత్, జనక్‌పురి కార్యక్రమాలు ఉత్తర భారతదేశంలో నిర్వహించే అతి పెద్ద కార్యక్రమాలు. ఆగ్రా, సమీప జిల్లాల ప్రజలలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి..’ అని వివరించారు.