Hanumana chalisha | నవనీత్ రాణా బైకుల్లా జైలుకు.. భర్త తలోజా జైలుకు..
ముంబై: పోలీసులు ఎంపీ నవనీత్ రాణాను ఇక్కడి బైకుల్లా మహిళా జైలుకు తరలించగా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాను గట్టి భద్రత మధ్య పొరుగున ఉన్న నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు.
ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రైవేట్ నివాసం 'మాతోశ్రీ' వెలుపల హనుమాన్ చాలీసా పఠనానికి పిలుపునిచ్చిన తరువాత ఈ జంటను శనివారం అరెస్టు చేశారు. ఎంపీ దంపతులు ఇచ్చిన పిలుపు శివసైనికుల ఆగ్రహానికి, నిరసనలకు కారణమైంది. ఆ తర్వాత ముంబై పోలీసులు ఈ జంటపై దేశద్రోహం కేసు పెట్టారు. ఆదివారం ముంబై కోర్టు రానా దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
తదనంతరం, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణాను ఆదివారం అర్థరాత్రి బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. ఆమె భర్త, అమరావతిలోని బద్నేరా ఎమ్మెల్యే అయిన రవి రాణాను మొదట ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. అయితే అక్కడ తగినంత స్థలం లేకపోవడంతో, న్యాయపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత అతన్ని నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు.
అంతకుముందు రాణాపై సెక్షన్ 153ఏ (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలు), సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు వారిపై ఐపిసి సెక్షన్ 124-ఎ (దేశద్రోహం)ని కూడా చేర్చారు.
ఐపీసీ సెక్షన్ 124-ఎ ప్రకారం ఒ వ్యక్తి మాటల ద్వారా లేదా ద్వేషం లేదా ధిక్కారాన్ని రేకెత్తించేందుకు ప్రయత్నించినప్పుడు లేదా చట్టం ద్వారా స్థాపితమైన ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి ప్రయత్నించినప్పుడు దేశద్రోహ నేరం సెక్షన్ మోపుతారు.
సబర్బన్ ఖార్‌లోని తమ నివాసంలో తమ విధులను నిర్వర్తించకుండా పోలీసులను అడ్డుకున్నందుకు, అరెస్టును అడ్డుకున్నందుకు రాణాపై పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని అధికారి తెలిపారు.
మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ఆదివారం నాడు రాణా జంటను అరెస్టు చేయడం ‘సముచితం’ అని పేర్కొన్నారు. శనివారం రాణకు చెందిన ఖార్ నివాసం వెలుపల నిరసనకు దిగినందుకు 13 మంది శివసేన కార్యకర్తలను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
టాపిక్