Hanuman Chalisa row: ముంబైలో హైడ్రామా.. ఎంపీ నవనీత్‌ కౌర్‌ దంపతుల అరెస్ట్-mp navneet rana and her husband mla ravi rana arrested in maharashtra ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hanuman Chalisa Row: ముంబైలో హైడ్రామా.. ఎంపీ నవనీత్‌ కౌర్‌ దంపతుల అరెస్ట్

Hanuman Chalisa row: ముంబైలో హైడ్రామా.. ఎంపీ నవనీత్‌ కౌర్‌ దంపతుల అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Apr 23, 2022 08:03 PM IST

మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా అంశం పెద్ద హైడ్రామాకే దారి తీసింది. స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలపై కౌర్ దంపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ నవనీత్ కౌర్ అరెస్ట్
ఎంపీ నవనీత్ కౌర్ అరెస్ట్ (HT)

ముంబైలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హనుమాన్ చాలీసా చాలెంజ్ తో నెలకొన్న ఈ వివాదంలో... ఎంపీ నవనీత్ కౌర్ తో పాటు ఆమె భర్త రవి రానాలను పోలీసులు అరెస్ట్ చేశారు. మత కలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ నవనీత్‌ రాణా దంపతులను ముంబయి పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 153 (ఏ) కింద కేసులు నమోదు చేశారు.  వీరిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

పోలీసుల చర్యలపై న‌వ‌నీత్ కౌర్ దంప‌తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  సీఎం ఉద్దవ్ థాక్రే, శివసేన నేతలు అనిల్ పరాబ్, సంజయ్ రౌత్ తో పాటు తమ ఇంటి ముట్టడికి వచ్చిన వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అరెస్ట్ కు కొద్దిసేపు ముందు సీఎం ఇంటి ముందు చాలీసా పఠించటంపై వెనక్కి తగ్గుతున్నట్లు కౌర్ దంపతులు ఓ ప్రకటన కూడా చేశారు.  రేపు ముంబైకి ప్రధాని వసున్న నేపథ్యంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు రవి రానా ప్రకటించారు. శాంతిభద్రతల కారణంగా ప్రధాని పర్యటనకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.  ఈ క్రమంలో ఒక్కసారిగా వీరిని అరెస్ట్ చేయటంతో ముంబైలో పెద్ద హైడ్రామానే నెలకొంది.

వివాదం ఏంటి...

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాల‌ని కోరారు ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు. లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని చాలెంజ్ విసిరారు. ఈ పరిణామం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫలితంగా ముఖ్యమంత్రి ప్రవేటు నివాసమైన మతోశ్రీ వద్ద పోలీసులు.. భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఉద్ధవ్​ ఠాక్రే హిందుత్వాను మర్చిపోయారని బీజీపీ ఎమ్మెల్యే రవి రాణా, ఆయన భార్య నవ్​నీత్​ రాణా(స్వతంత్ర ఎంపీ)లు ఆరోపించారు. హిందుత్వాన్ని ఉపయోగించుకునే ఆయన అధికారంలోకి వచ్చారని విమర్శించారు. 'బాలాసాహేబ్​ పాఠాలను ఉద్ధవ్​ ఠాక్రే మర్చిపోయినట్టున్నారు. అందుకే మేము ఓ నిర్ణయానికి వచ్చాము. శనివారం ఉదయం.. మతోశ్రీ వద్ద హనుమాన్​ చాలీసా చదువుతాము. శాంతియుతంగా వెళతాము. ముంబైవాసులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాము,' అని గత వారం నవ్​నీత్​ రాణా వ్యాఖ్యానించారు. ఫలితంగా సీఎం ఇంటి వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.

మరోవైపు నవ్​నీత్​ రాణా నివాసం వద్ద సైతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దంపతులు బయటకు వస్తే.. వారిని అడ్డుకుందామని అనేకమంది మంది శివసేన కార్యకర్తలు.. వారి ఇంటికి తరలివెళ్లారు. 'మతోశ్రీకి ఎలా వెళతారో మేమూ చూస్తాము,' అంటూ శివసేన కార్యకర్తలు వారిని హెచ్చరించారు. ఈ క్రమంలో.. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. 

మరోవైపు నవ్​నీత్​ రాణా దంపతులకు శుక్రవారమే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా.. దానికి వారే బాధ్యత వహించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. పోలీసులపై నవ్​నీత్​ రాణా దంపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను బయటకు అనుమతించడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే సీఎం ఉద్ధవ్​ ఠాక్రేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల్లో నవనీత్ కౌర్ అమరావతి పార్లమెంట్ స్థానం నుంచి ఇండిపెడెంట్‌గా పోటీచేసి విజయం సాధించారు. కౌర్ భర్త రవి రానా సైతం ఎమ్మెల్యేగా గెలిచారు.

IPL_Entry_Point