Mehbooba Mufti: శివుడికి అభిషేకం చేయడంపై మెహబూబా ముఫ్తీపై విమర్శలు
Mehbooba Mufti: జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ లో ఉన్న ఒక శివాలయాన్ని సందర్శించి, అక్కడ పూజలు చేయడంపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలపై పీడీపీ (PDP) నేత ముఫ్తీ ఘాటుగా స్పందించారు.
Mehbooba Mufti: పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ (PDP president Mehbooba Mufti) ఇటీవల జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ లో పర్యటించారు. అక్కడ ఉన్న మండి అజోట్ లో ఉన్న నవగ్రహ ఆలయంలో శివుడికి అభిషేకం చేశారు. దీనిపై స్థానికంగా ఉన్న ముస్లిం వర్గాల నుంచి ఉత్తర ప్రదేశ్ లోని దియోబండ్ (Deoband) ముస్లిం పెద్దల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై మెహబూబా ముఫ్తీ స్పందించారు.
Ganga-Jamuni tehzeeb: గంగ యమున సంస్కృతి
ఫూంచ్ లో నవగ్రహ ఆలయంలోని శివ లింగానికి అభిషేకం చేయడంపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ (PDP president Mehbooba Mufti) స్పందించారు. ఆ ఆలయాన్ని తమ పార్టీ పీడీపీ కి చెందిన సీనియర్ నేత యశ్ పాల్ శర్మ నిర్మించారని, ఆయన గత సంవత్సరం మరణించారని ముఫ్తీ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆ ఆలయాన్ని సందర్శించానని వివరించారు. ‘‘ఆలయం లోనికి వెళ్లిన తరువాత అక్కడున్న ఒక వ్యక్తి ఎంతో భక్తిశ్రద్ధలతో ఒక కలశంలో నీటిని తీసుకువచ్చి, అక్కడ ఉన్న శివలింగానికి అభిషేకం చేయాలని కోరాడు. అతడిని బాధపెట్టడం ఇష్టం లేక ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేశాను’’ అని వివరించారు. ఈ విషయాన్ని పెద్దగా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Mehbooba Mufti: లౌకిక భారత్
భారత్ లౌకిక దేశమని, గంగ జమున సంస్కృతికి (Ganga-Jamuni tehzeeb) నెలవని ఆమె (PDP president Mehbooba Mufti) గుర్తు చేశారు. తనపై విమర్శలు చేసేవారికి జవాబు ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. ‘‘మన దేశంలో హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ముస్లిం ప్రార్థనాస్థలాల్లో చాదర్ లను సమర్పించే హిందువుల సంఖ్య ముస్లింల కన్నా చాలా ఎక్కువన్న విషయం గుర్తుంచుకోవాలి’ అని ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇంతకన్నా సాగదీయాల్సిన అవసరం లేదన్నారు.