Mamata Banerjee: 'వాషింగ్ మెషిన్'తో బీజేపీపై సీఎం మమతా బెనర్జీ విమర్శలు: వీడియో.. కూటమిపై మారిన స్వరం
CM Mamata Banerjee: బీజేపీపై సీఎం మమతా బెనర్జీ మరోసారి మాటల దాడి చేశారు. వాషింగ్ మెషిన్‍తో వ్యంగ్యంగా విమర్శించారు. ప్రతిపక్షాలు ఐక్యం కావాలని అన్నారు.
CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress - TMC) అధినేత్రి మమతా బెనర్జీ.. తన వైఖరిని మళ్లీ మార్చుకున్నట్టే కనిపిస్తోంది. 2024 ఎన్నికల కోసం ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగా వెళతామని ఇటీవల చెప్పిన ఆమె.. అందుకు విభిన్నంగా తాజాగా మాట్లాడారు. ప్రతిక్షాలన్నీ మళ్లీ ఐక్యం కావాలంటూ పిలుపునిచ్చారు. కాగా, సభా వేదికపైనే వాషింగ్ మెషిన్‍ను ఉపయోగించి.. దాని సాయంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సింబాలిక్‍గా విమర్శలు చేశారు. వివరాలివే..
బీజేపీలో చేరితే అంతేనా..
CM Mamata Banerjee: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం… రాష్ట్రాలకు నిధులను న్యాయంగా పంచడం లేదని రెండు రోజుల నిరసనను కోల్‍కతాలో చేపట్టారు మమతా బెనర్జీ. ఈ సందర్శంగా బుధవారం సభా వేదికపై ఓ వాషింగ్ మెషిన్‍ను ఏర్పాటు చేసింది టీఎంసీ. దానికి బీజేపీ వాషింగ్ మెషిన్ అని పేరు పెట్టింది. బీజేపీ వాషింగ్ మెషిన్‍లో నలుపు రంగు క్లాత్ వేస్తే.. తెలుపు రంగు క్లాత్‍లా మారుతుందనేలా మమతా బెనర్జీ ప్రదర్శించారు. కేసులు ఉన్న వారు, అవినీతిపరులు బీజేపీలో చేరితే స్వచ్ఛమవుతున్నారని అర్థమొచ్చేలా మమతా బెనర్జీ ఇలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
CM Mamata Banerjee: “బీజేపీ పాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ప్రతిపక్షాలు అంతులేని వేధింపులకు గురవుతున్నాయి. అయితే, ప్రతిపక్ష నేతలు.. బీజేపీలో చేరితే నిమిషాల్లోనే వారు నిరపరాదులు అవుతున్నారు. అదే బీజేపీ వాషింగ్ మెషిన్ మ్యాజిక్” అని టీఎంసీ రాసుకొచ్చింది.
బీజేపీని తరిమికొట్టాలి
CM Mamata Banerjee: ప్రతిపక్షాలన్నీ ఐక్యమై అధికారం నుంచి బీజేపీని తరిమికొట్టాలంటూ సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. “అన్ని ప్రతిపక్షాలు కచ్చితంగా కలిసి పోరాటం చేయాలి. దేశం నుంచి, అధికారం నుంచి బీజేపీని తరిమికొట్టాలి. అహంకారంతో ఉన్న బీజేపీని ఓడించాలి. దుష్యాసనులను వెళ్లగొట్టి దేశాన్ని కాపాడాలి. దుర్యోధనులను పంపించి ప్రజస్వామ్యాన్ని కాపాడాలి. పేద ప్రజలను రక్షించుకోవాలి” అని మమతా బెనర్జీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
మారిన స్వరం
CM Mamata Banerjee: 2024 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇటీవల మమతా బెనర్జీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీపై రెండేళ్ల జైలు శిక్ష పడడం, ఎంపీగా ఆయనపై అనర్హత వేటు పడిన తర్వాత మమత.. తన వైఖరి మారినట్టు కనిపిస్తోంది. మళ్లీ ప్రతిపక్షాలు ఐక్యం కావాలని, కలిసి పోరాడదామని ఆమె పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన పిలుపు మేరకు పార్లమెంటుకు నల్లదుస్తులతో తృణమూల్ ఎంపీలు వెళ్లారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విందుకు కూడా హాజరయ్యారు.
కాగా, రాహుల్ గాంధీపై అనర్హత వేటును మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. రాహుల్‍పై అనర్హత వేసినప్పుడు.. ప్రధాని మోదీ కూడా తన కామెంట్లకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. తమ పార్టీ ఈ విషయంపై పరిశీలిస్తోందని అన్నారు.