Maharashtra political crisis : ‘మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు దిశగా సంక్షోభం’
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం విధాన సభ రద్దు దిశగా సాగుతోందని శిశసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
ముంబై, జూన్ 22: మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం మధ్య శివసేన నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం రాష్ట్ర శాసనసభ రద్దుపై సంకేతాలు ఇచ్చారు.
‘మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం విధానసభ రద్దుకు దారి తీస్తోంది’ అని రౌత్ ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అయితే దీనికి విరుద్ధంగా మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజబల్ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలను తోసిపుచ్చారు.
‘మధ్యంతర ఎన్నికలా? ఇంకా చర్చలు జరగలేదు. నేను ఏమి చెప్పగలను?..’ అని మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ అన్నారు.
రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై ముంబైలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలోని ఎంవీఏ ప్రభుత్వంలో కొనసాగుతున్న అస్థిరతకు కారణమైన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండేకు వ్యతిరేకంగా ఔరంగాబాద్‌లోని శివసేన మహిళా కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేశారు.
33 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఏడుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మొత్తంగా 40 మంది ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండేకు మద్దతు తెలుపుతూ లేఖపై సంతకం పెట్టారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర శాసనసభలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ తిరుగుబాటు శాసనసభ్యులు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి లేఖ రాయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈరోజు ఉదయం రౌత్ విలేకరులతో మాట్లాడుతూ ‘ఏక్‌నాథ్ షిండేతో ఉన్న ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నాయి. అందరూ శివసేనలోనే ఉంటారు. మేం నిరంతరం పోరాడుతాం. మేం అధికారం కోల్పోవచ్చు కానీ పోరాటం కొనసాగిస్తాం..’ అని వ్యాఖ్యానించారు.
‘ఏకనాథ్ షిండే మా పార్టీ సీనియర్ సభ్యుడు. ఆయన మా స్నేహితుడు. మేం దశాబ్దాలుగా కలిసి పనిచేశాం. ఒకరినొకరు దూరమవడం అంత సులభం కాదు. ఈ ఉదయం నేను ఆయనతో ఒక గంట మాట్లాడాను. దాని గురించి పార్టీ చీఫ్‌కి తెలియజేసాను..’ అని రౌత్ చెప్పారు.
టాపిక్