Thiomargarita magnifica | ఇది కంటికి కనిపించే బ్యాక్టీరియా
వైరస్, బ్యాక్టీరియాలను సూక్ష్మజీవులుగా పరిగణిస్తారు. వాటిని నేరుగా మన కంటితో చూడలేం. సూక్ష్మదర్శిని(మైక్రోస్కోప్) ద్వారా మాత్రమే చూడగలం. అంత సూక్ష్మ పరిమాణంలో అవి ఉంటాయి. ఇటీవల శాస్త్రవేత్తలు ఒక బ్యాక్టీరియాను గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన బ్యాక్టీరియాల్లో అదే అతి పెద్దది. ఆ బ్యాక్టీరియాను నేరుగా మన కంటితో చూడవచ్చు.
కరేబియన్ దీవుల్లో ఈ సూక్ష్మజీవిని శాస్త్రవేత్తలు గుర్తించారు. నూడుల్స్ షేప్‌లో ఉండే ఈ బ్యాక్టీరియా ఇప్పటివరకు గుర్తించిన బ్యాక్టీరియాల్లో అతి పెద్దది. దీనికి `థియోమార్గరిటా మాగ్నిఫికా(Thiomargarita magnifica)` అని నామరణం కూడా చేశారు. ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద బ్యాక్టీరియా సైజ్ 750 మైక్రోమీటర్లు మాత్రమే.
10000 మైక్రోమీటర్ల బ్యాక్టీరియా
ఇప్పటివరకు గుర్తించిన బ్యాక్టీరియాలతో పోలిస్తే.. తాజాగా కరేబియన్ దీవుల్లో గుర్తించిన బ్యాక్టీరియా ఎన్నో రెట్లు పెద్దది. ఇప్పటివరకు 750 మైక్రో మీటర్ల బ్యాక్టీరియానే అతి పెద్దది కాగా, తాజాగా గుర్తించిన బ్యాక్టీరియా సగటున 10 వేల మైక్రోమీటర్ల సైజ్‌లో ఉంది. కొన్ని 20 వేల మైక్రోమీటర్ల సైజ్‌లో `భారీ`గా ఉన్నాయి. సాధారణంగా బ్యాక్టీరియాలు 1 నుంచి 5 మైక్రో మీటర్ల సైజ్‌లోనే ఉంటాయి.
మన కంటితో చూడవచ్చు
ఈ బ్యాక్టీరియాను మన కంటితో నేరుగా చూడవచ్చు. 10 వేల మైక్రో మీటర్లు అంటే, మన కనురెప్పపై ఉండే వెంట్రుకల్లో అతిచిన్న వెంట్రుక అంత సైజ్. బ్యాక్టీరియాలు ఏకకణ జీవులు. బ్యాక్టీరియాల్లో మంచివి, చెడువి ఉంటాయి. అంటే, మానవుడికి మంచి చేసేవి కొన్నైతే, అనారోగ్యం కలిగించేవి మరికొన్ని. భూమిపై ప్రతీ ప్రాంతంలోనూ ఇవి ఉంటాయి. భూమిపై తొలి జీవి బ్యాక్టీరియానే అని నిర్ధారించారు. తాజాగా గుర్తించిన Thiomargarita magnifica బ్యాక్టీరియా గురించిన విశేషాలను `సైన్స్` పత్రికలో ప్రచురించారు.
టాపిక్