Karnataka free bus travel: కర్నాటక అంతర్రాష్ట్ర బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. కానీ షరతులు వర్తిస్తాయి..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో తొలి హామీని ఆదివారం అమలు చేయనున్నారు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (karnataka assembly elections 2023) సందర్భంగా కాంగ్రెస్ (congress) పార్టీ ఇచ్చిన హామీల్లో తొలి హామీని ఆదివారం అమలు చేయనున్నారు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ ‘శక్తి’ పథకాన్ని విధాన సౌధ నుంచి ఆదివారం ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించనున్నారు.
‘శక్తి’ పథకం..
కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఇకపై మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎసీ బస్సులు, వోల్వో బస్సుల్లో ప్రయాణించేవారికి ఈ పథకం వర్తించదు. అంటే, ఏసీ బస్సులు, వోల్వో బస్సుల్లో ప్రయాణించే మహిళలు టికెట్ తీసుకుని ప్రయాణించాల్సిందే. ఎసీ, వోల్వో బస్సులు కాకుండా ఎక్స్ ప్రెస్ సహా అన్ని ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఈ ‘శక్తి’ పథకం ఒకటి.
అంతర్రాష్ట్ర సర్వీసుల్లో షరతులు..
అంతర్రాష్ట్ర సర్వీసుల్లో కూడా ఈ పథకం వర్తిస్తుంది. అంటే, కర్నాటక నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణించే మహిళలు కర్నాటక రాష్ట్రంలోని వేరే ఊరి వరకే ప్రయాణిస్తే, వారికి టికెట్ అవసరం లేదు. కర్నాటక సరిహద్దు రాష్ట్రాల్లోని గమ్య స్థానాలకు వెళ్లే మహిళలు మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, వారికి కూడా ఒక వెసులుబాటు కల్పించారు. కర్నాటక సరిహద్దు దాటిన తరువాత 20 కిమీల లోపు గమ్యస్థానం ఉంటే, వారికి ఉచిత ప్రయాణమే. కర్నాటక సరిహద్దు దాటిన తరువాత 20 కిమీల లోపు దిగిపోయే మహిళలు కర్నాటక అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచితంగానే ప్రయాణించవచ్చు.