Jayalalithaa death: ‘శశికళపై అనుమానాలున్నాయి.. ఆమెను విచారించాల్సిందే’
Jayalalithaa death: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత మృతిపై ఏర్పాటైన జస్టిస్ ఆర్ముగస్వామి నివేదికలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి.
Jayalalithaa death: 2016లో జయయలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. 2016 సెప్టెంబర్ 22న అపోలో ఆసుపత్రిలో ఆమె జాయిన్ అయ్యారు. 75 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన చికిత్స అనంతరం అదే సంవత్సరం డిసెంబర్ 25 న ఆమె మరణించారు.
Jayalalithaa death: జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతికి సంబంధించి నిజానిజాలను వెలికితీయడానికి ఏర్పాటైన జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్.. జయలలిత నెచ్చెలి, ఆమెకు అత్యంత సన్నిహితురాలైన శశికళ పై అనుమానాలున్నాయని తేల్చింది. శశికళ ను దోషిగా తేల్చేందుకు అవసరమైన ఆధారాలున్నాయని, అందువల్ల సమగ్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడింది. 2012 నుంచి జయలలిత, శశికళల మధ్య సత్సంబంధాలు లేవన్న విషయాన్ని గుర్తు చేసింది. కమిషన్ నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Jayalalithaa death: ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి పాత్ర కూడా
జయలలిత మృతికి దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు అవసరమని జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ స్పష్టం చేసింది. శశికళతో పాటు ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి పాత్రపై కూడా కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. జయలలిత మరణించిన సమయంలో రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న డాక్టర్ రామమోహన రావు కూడా నేరం చేశాడనడానికి ఆధారాలున్నాయని నివేదిక పేర్కొంది. నాటి హెల్త్ మినిస్టర్ విజయ భాస్కర్ తో పాటు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి కూడా జయలలిత ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు సమాచారం ఇచ్చారని నివేదిక పేర్కొంది. మద్రాసు హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఈ కమిషన్ ను 2017లొ ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఆగస్ట్ లో కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
Jayalalithaa death: అక్రమ ఆస్తుల కేసు
ఇప్పటికే శశికళను అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేశారు. జయలలిత ప్రధాన నిందితురాలిగా ఉన్న అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తేల్చి అరెస్ట్ చేశారు. 2021లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత, జయలలిత మృతిపై ఉన్న అన్ని అనుమానాలపై విచారణ జరుపుతామని ప్రకటించింది. ఈ విషయాన్ని డీఎంకే తమ ఎన్నికల హామీలో ఒకటిగా చేర్చింది.
Jayalalithaa death: అపోలో అభ్యర్థన
ఈ కమిషన్ విచారణపై అపోలో హాస్పిటల్స్ ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ వేసింది. ఈ కమిషన్ విచారణ నుంచి తమను మినహాయించాలని, జస్టిస్ ఆర్ముగస్వామి తమ పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నాడని, మెడికల్ సంబంధిత విషయాలపై ఆయనకు అవగాహన లేదని కోర్టుకు వివరించింది. దాంతో, సుప్రీంకోర్టు ఎయిమ్స్ వైద్యులతో ఒక మెడికల్ బోర్డును కూడా విచారణలో భాగం చేసింది.