Chandrayaan-3 : చంద్రయాన్-3లో కీలక ఘట్టం, చంద్రుడి కక్ష్యలోకి ఆర్బిటర్
Chandrayaan-3 : చంద్రయాన్-3 ప్రయోగంలో కీలక ఘటన జరిగింది. శనివారం రాత్రి చంద్రయాన్-3 ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి చేరింది.
Chandrayaan-3 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3కి సంబంధించి కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. శనివారం రాత్రి ఏడు గంటలకు చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ఆర్బిటర్ ప్రవేశించింది. చంద్రుడి కక్ష్యలోకి వెళ్లేలా లూనార్ ఆర్బిట్ ఇనసర్షన్ ప్రక్రియను ISRO చేపట్టింది. దీని అనంతరం మరో 18 రోజులు చంద్రుడి కక్ష్యలోనే చంద్రయాన్-3 ఆర్బిటర్ తిరగనుంది. ఇస్రో చేపట్టే ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో యావత్ దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.
18 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలో
చంద్రయాన్-3 మిషన్ లో అత్యంత కీలకమైన ఘట్టం శనివారం చోటుచేసుకుంది. ఇస్రో చంద్రయాన్-3 ఆర్బిటర్ చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. భూ కక్ష్యలను పూర్తి చేసుకున్న చంద్రయాన్-3 శనివారం రాత్రి 7 గంటలకు జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించిన ఇస్రో కచ్చితమైన ప్రణాళికతో ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి చంద్రయాన్-3ను విజయవంతంగా ప్రవేశపెట్టింది. 18 రోజుల పాటు చంద్రుడి చుట్టూ తిరగనున్న చంద్రయాన్-3 జాబిల్లిపై దిగనుంది. అనంతరం రోవర్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యి పరిశోధనలు చేయనుంది.
14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు
చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనల కోసం జులై 14న చంద్రయాన్-3ని ఇస్రో లాంచ్ చేసింది. మొత్తం 5 దశలుగా స్పేస్‌క్రాఫ్ట్ ఆర్బిట్‌ను పెంచుకుంటూ వచ్చింది ఇస్రో. ఆగస్ట్ 1న ఈ స్పేస్క్రాఫ్ట్భూమి కక్ష్యను వీడి చంద్రుడివైపు ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తాజాగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రయాన్ ప్రాజెక్ట్స్‌లో భాగంగా ఇప్పటివరకు మూడు ప్రయోగాలు చేపట్టింది ఇస్రో. మొదటి ప్రయోగమైన చంద్రయాన్-1 విజయవంతమైంది. అంతేకాకుండా చంద్రుడిపై నీటి జాడలున్నాయని నిరూపించి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇక 2019లో చేపట్టిన రెండో ప్రయోగం చంద్రయాన్-2 విఫలమైంది. చివరి దశ అయిన ల్యాండింగ్ వరకు ఈ ప్రయోగం వెళ్లగలిగింది. కానీ చంద్రుడి ఉపరితలంపైకి దిగే సమయంలో విఫలమై, కుప్పకూలిపోయింది. ఈసారి ఎలాంటి తప్పిదాలు జరక్కుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుని, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసిన ఇస్రో... చంద్రయాన్-3ని ప్రయోగించింది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైనది చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్. ఈ ప్రయోగం విజయవంతమైతే, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయిన నాలుగో దేశంగా భారత్ రికార్డులకెక్కుతుంది. అమెరికా, సోవియట్ యూనియన్, చైనాలు ఇప్పటి వరకు ఈ ఘనతను సాధించాయి. ఈసారి చంద్రయాన్-3 సఫలం అవ్వాలని యావత్ దేశం కోరుకుంటుంది.
టాపిక్