Agnipath protests: ‘అగ్ని’పథ్ నిరసనలతో రైల్వేకు రూ. 259 కోట్ల నష్టం
Agnipath protests: అగ్నిపథ్ ఆందోళన కారణంగా భారతీయ రైల్వే రూ. 259.44 కోట్ల నష్టాన్ని చవిచూసిందని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల కారణంగా ఈ ఏడాది భారతీయ రైల్వేకు రూ. 259.44 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం లోక్‌సభకు తెలియజేసింది. ఇతర ఆందోళనల కారణంగా 2019 , 2021 మధ్య రైల్వేలు రూ. 1,117ల మేర నష్టాన్ని చవిచూశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
‘2022 సంవత్సరంలో రైల్వే ఆస్తుల నష్టం/విధ్వంసం కారణంగా భారతీయ రైల్వే రూ. 259.44 కోట్ల నష్టాన్ని చవిచూసింది..’ అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
రైళ్ల రద్దు కారణంగా ప్రయాణికులకు జూన్ 14- జూన్ 30 మధ్య రైల్వే మొత్తం రూ. 102.96 కోట్ల రీఫండ్ మంజూరు చేసిందని వైష్ణవ్ తెలియజేశారు. 2019లో రైల్వేలు రూ. 151 కోట్లు, 2020లో రూ. 904 కోట్లు, 2021లో రూ. 62 కోట్లు నష్టపోయాయి. 2019లో మొత్తం 95 కేసులు, 2020లో 30, 2021లో 34 కేసులు రైల్వే ఆస్తుల ధ్వంసానికి సంబంధించి నమోదయ్యాయి. నష్టం, విధ్వంసం జరిగిన అన్ని సంఘటనల్లోనూ కేసులు నమోదయ్యాయి. నేరస్థులను గుర్తించి, వారిని అరెస్టు చేశాం. ఈ కేసుల విచారణను సీనియర్ అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తారు’ అని కేంద్ర మంత్రి చెప్పారు.
రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), రాష్ట్ర పోలీసులు, ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) నేరాలను అరికట్టడానికి, కేసులను నమోదు చేయడానికి, దర్యాప్తు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.
నష్టాన్ని పూడ్చేందుకు ఇప్పటివరకు ఎలాంటి రికవరీ చేయలేదని తెలిపారు. శాంతిభద్రతలకు సంబంధించి ఈ ఏడాది జూన్ వరకు అత్యధిక విధ్వంసం జరిగిన రాష్ట్రాల్లో బీహార్, తెలంగాణ ఉన్నాయి.
ఈ ఏడాది నిరసనల కారణంగా మరణించిన లేదా గాయపడిన ప్రయాణికులకు, వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని వైష్ణవ్ అన్నారు.
‘అత్యున్నతస్థాయి భద్రతా సమీక్ష కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఆందోళనలు, రైల్ రోకో, బంద్ మొదలైన సందర్భాల్లో రైల్వేలు ఎదుర్కొన్న అంతరాయం, విధ్వంసం కేసుల్లో పరిహారం క్లెయిమ్ కేసులను దాఖలు చేయడానికి జోనల్ రైల్వేలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి..’ అని మంత్రి చెప్పారు.
టాపిక్