IMD Rain Alert : ఈ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
IMD Weather Update : ఈశాన్య భారతదేశంలో రాబోయే ఏడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కూడా రాబోయే ఐదు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతాలు, ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ్టి తర్వాతే భారీ వర్షాల నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ భారీ వర్షాలు కొనసాగుతాయి. అదే సమయంలో ఈశాన్య భారతంలో మరో ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ భారతదేశంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
ఆగస్టు 11 నుంచి 17 వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 11న జమ్మూకశ్మీర్, లద్దాఖ్, ఆగస్టు 14-17 తేదీల్లో పశ్చిమ రాజస్థాన్, ఆగస్టు 11,14 తేదీల్లో పంజాబ్, ఆగస్టు 11, 15 తేదీల్లో హర్యానా, చండీగఢ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగస్టు 11న పంజాబ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆగస్టు 11, 12 తేదీల్లో తూర్పు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
పశ్చిమ, మధ్య భారత రాష్ట్రాల్లో వారం రోజుల పాటు రుతుపవనాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలో ఆగస్టు 11న భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య భారత రాష్ట్రాల విషయానికొస్తే ఆగస్టు 11,17 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, బీహార్, ఆగస్టు 11,14,16 తేదీల్లో అన్ని హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలో, ఆగస్టు 14,16 తేదీల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, గంగా పశ్చిమ బెంగాల్లో, ఆగస్టు 13-15 తేదీల్లో జార్ఖండ్‌లో, ఆగస్టు 11, 13 తేదీల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పంజాబ్, హరియాణాలోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. మొహాలీ, లుధియానా, అమృత్ సర్, రూప్ నగర్, అంబాలా సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల్లో పఠాన్ కోట్ లో 82 మిల్లీమీటర్లు, గురుదాస్ పూర్ లో 68.8 మిల్లీమీటర్లు, అమృత్ సర్ లో 57.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హర్యానాలోని అంబాలాలో 83.8 మిల్లీమీటర్లు, కర్నాల్ లో 36.8 మిల్లీమీటర్లు, సిర్సాలో 20 మిల్లీమీటర్లు, హిసార్ లో 6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ లో 28.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
దక్షిణ భారతదేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో జోరు వానలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలో మరో వారంరోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోనూ వానలు పడతాయని అంచనా. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రతోపాటుగా రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది.