IB Recruitment 2023 : పదో తరగతి అర్హతతో ఐబీలో 677 ఉద్యోగాలు, ఇవాళ్టి నుంచే దరఖాస్తులు-ib recruitment 2023 tenth qualification 677 posts registration starts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ib Recruitment 2023 : పదో తరగతి అర్హతతో ఐబీలో 677 ఉద్యోగాలు, ఇవాళ్టి నుంచే దరఖాస్తులు

IB Recruitment 2023 : పదో తరగతి అర్హతతో ఐబీలో 677 ఉద్యోగాలు, ఇవాళ్టి నుంచే దరఖాస్తులు

Bandaru Satyaprasad HT Telugu
Oct 14, 2023 06:26 PM IST

IB Recruitment 2023 : పదో తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి అప్లికేషన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యాయి.

ఐబీలో ఉద్యోగాలు
ఐబీలో ఉద్యోగాలు

IB Recruitment 2023 : ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో ఐబీలో అసిస్టెంట్ సెక్యూరిటీ, మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mha.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొంది. మొత్తం 677 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 362 ఖాళీలు సెక్యూరిటీ అసిస్టెంట్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులు, 315 మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు కేటాయించారు.

అర్హతలు, ఫీజు వివరాలు

ఈ ఐబీ ఉద్యోగాలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సెకండరీ స్కూల్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కనీస వయోపరిమితి 18 ఏళ్లు, గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మల్టీ టాస్కింగ్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలుగా వెల్లడించారు. అన్‌రిజర్వ్‌డ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు రూ. 50 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అక్టోబర్ 14 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నవంబర్ 13వ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

అభ్యర్థులు ఇలా దరఖాస్తు చేసుకోండి

  • ఐబీ అధికారిక వెబ్ సైట్ mha.gov.in పై క్లిక్ చేయండి
  • వెబ్ సైట్ హోమ్‌ పేజీలో ఐబీపై క్లిక్ చేయండి
  • ఆ తర్వాత లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను రూపొందుకునేందుకు నమోదు చేసుకోండి
  • ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వండి
  • ఆ తర్వాత అప్లికేషన్ ను పూర్తిచేయండి. ఫొటో, సంతకం, ఇతర సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయండి
  • ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
  • చివరిగా దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తు అవసరాలకు ప్రింటౌట్ తీసుకోండి.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న ఐదు నగరాల్లో ఒక కేంద్రంలో టైర్-1 పరీక్షకు హాజరు కావాలి. పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి ¼ నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. టైర్-I పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు టైర్-II పరీక్షకు అర్హులు అవుతారు. అసిస్టెంట్ సెక్యూరిటీ, మోటార్ ట్రాన్స్‌పోర్ట్, రెండు పోస్టులను ఎంచుకున్న అభ్యర్థుల టైర్-I & టైర్-II పరీక్షలో ఫలితాల ఆధారంగా, తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు.

Whats_app_banner