జ్ఞాన్‌వాపీ మసీదు గోడలపై త్రిశూలం గుర్తులు
జ్ఞాన్‌వాపీ మసీదు వివాదంలో మరో కొత్త అంశం వెలుగు చూసింది. మసీదు వీడియో సర్వే సందర్భంగా మసీదు వజూఖానాలోని కొలనులో శివలింగం లభ్యమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, మసీదు గోడలపై త్రిశూలం గుర్తులు కనిపించాయని అదే వీడియో సర్వేలో తేలిందని సమాచారం.
ఒకవైపు జ్ఞాన్‌వాపీ మసీదు వివాదం కోర్టులో కొనసాగుతోంది. జిల్లా కోర్టులో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. వారణాసి జిల్లా కోర్టులో వాద, ప్రతివాదనలు సాగుతున్నాయి. మరోవైపు, కింది కోర్టు ఆదేశాల మేరకు జరిగిన జ్ఞాన్‌వాపీ మసీదు వీడియో సర్వేకు సంబంధించిన విశేషాలు రోజుకొకటి బయటపడుతున్నాయి.
త్రిశూలం ఆనవాళ్లు
మసీదులో జరిపిన వీడియో సర్వే వివరాలు ప్రస్తుతం కోర్టు వద్ద ఉన్నాయి. అయితే, ఆ వీడియో సర్వే లో వెల్లడైన విశేషాలంటూ పలు అంశాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. తాజాగా, మసీదు గోడలపై త్రిశూలం గుర్తులు ఉన్నాయని, వాటిని కూడ సర్వే సందర్భంగా వీడియో తీశారని ఒక వార్త బయటకు వచ్చింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. శివుడి ఆయుధంగా త్రిశూలాన్ని భావిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా, త్రిశూలం ఆనవాళ్లు కూడా బయటపడడంతో, జ్ఞాన్‌వాపీ మసీదును పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసి, ఆ పునాదులపైననే నిర్మించారనేందుకు కొత్త ఆధారాలు లభించాయని హిందూ వర్గాలు వాదిస్తున్నాయి. 16వ శతాబ్దంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని పాక్షికంగా కూల్చి, జ్ఞాన్‌వాపీ మసీదును నిర్మించారనే వాదనకు బలం చేకూరుతోందని చెబుతున్నాయి.
మొదట శివలింగం తరువాత త్రిశూలం
మసీదు సర్వే సందర్బంగా, వజూఖానాలోని కొలనులో శివలింగం లభ్యమైందన్న వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటపడ్డాయి. దాంతో, శివలింగం లభ్యమైన ప్రాంతాన్ని సంరక్షించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. అదే సమయంలో, ముస్లింల నమాజ్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదని స్పష్టం చేసింది. అయితే అది శివలింగం కాదు, అది పనికిరాకుండా పోయిన నాటి ఫౌంటెయిన్ అని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. వజూఖానాలోని కొలనులో నీటిని ఇప్పుడు పూర్తిగా తోడేశారు. దాంతో శివలింగం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని తెలుస్తోంది. తాజాగా, మసీదు గోడలపై త్రిశూలం గుర్తులు బయటపడ్డాయి. ఈ వివాదం ఇలా ఇంకా ఎంత దూరం వెళ్లుందోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.