Shinzo Abe death : నాడు ఇందిరా గాంధీ.. నేడు షింజో అబే.. ఇలా ఎందరో!
Shinzo Abe death : జాన్ ఎఫ్ కెనడీ.. ఇందిరా గాంధీ.. బెనజీర్ బుట్టో.. వీరందరు ఒకప్పుడు ఆయా దేశాలను పాలించిన నేతలు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలాగే దారుణ హత్యకు గురైన నేతలు.
Shinzo Abe death : జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే దారుణ హత్యతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఎన్నికల ప్రచారం కోసం నారా ప్రాంతానికి వెళ్లిన షింజో అబేపై.. ఓ వ్యక్తి వెనుక నుంచి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో షింజో అబే ప్రాణాలు కోల్పోయారు.
ఇలా ఎందరో దేశాధినేతలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ విధంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత దేశం నుంచే ఇద్దరు ఉన్నారు. ఒక్కసారి నాటి పరిస్థితులు, అర్ధాంతరంగా ముగిసిపోయిన ఆ నేత జీవితాలను ఓసారి పరిశీలిద్దాము..
ఇందిరా గాంధీ..
భారతీయులకు ఇందిరా గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ అనేకమంది గుండెల్లో మాజీ ప్రధానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కాగా 1984 అక్టోబర్ 31న ఉదయం.. ఢిల్లీలోని తన నివాసంలో ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. సొంత సెక్యురిటీ గార్డులే ఆమెపై కాల్పులకు తెగబడ్డారు. ఆమెను వెంటనే ఎయిమ్స్‌కు తరలించినా, ఫలితం దక్కలేదు.
భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ చరిత్రకెక్కారు. తన ధైర్యంతో ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. దేశంలోని చాలా మంది తల్లిదండ్రులు.. ఆమె పేరును తమ బిడ్డలకు పెట్టుకున్నారు.
రాజివ్ గాంధీ..
ఇందిరా గాంధీ మరణం అనంతరం ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ సైతం అదే తరహాలో మరణిస్తారని ఎవరు ఊహించలేదు. 1989 వరకు ప్రధానిగా కొనసాగిన ఆయన.. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. రెండేళ్లకే తిరిగి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా.. 1991 మే 21న తమిళనాడు శ్రీపెరుమ్బుదూర్కు వెళ్లారు రాజీవ్ గాంధీ. మహిళా సూసైడ్ బాంబర్ చేతిలో ఆయన దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహం గుర్తుపట్టలేనంత స్థితిలో కనిపించింది.
ఇక్కడ భారత జాతి పిత మహాత్మ గాంధీ గురించి కూడా ప్రస్తావించాలి. దేశంలో ఆయన ఎలాంటి పదవులు చేపట్టకపోయినా.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయనది కీలక పాత్ర. అలాంటి మహాత్ముడిని.. 1948 జనవరి 30, గాడ్సే అనే వ్యక్తి కాల్చి చంపేశాడు.
అబ్రహం లింకెన్..
అమెరికా 16వ అధ్యక్షుడిగా విధులు నిర్వహించి.. ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన అబ్రహం లింకెన్ కూడా దారుణ హత్యకు గురయ్యారు. 1865 ఏప్రిల్ 14, వాషింగ్టన్లో లింకెన్ను జాన్ విల్కెస్ బూత్ అనే వ్యక్తి కాల్చి చంపేశాడు.
జాన్ ఎఫ్ కెనడీ..
అమెరికాకు దక్కిన గొప్ప అధ్యక్షుల్లో జాన్ ఎఫ్ కెనడీ ఒకరు! ఆయన్ని జేఎఫ్‌కే అని ముద్దుగా పిలిచుకునేవారు. అమెరికాకు ఆయన 35వ అధ్యక్షుడు. కాగా.. 1963 నవంబర్ 22న ఆయన దారుణ హత్యకు గురయ్యారు. నడి రోడ్డు మీద దుండగడు ఆయన్ని కాల్చి చంపేశాడు. ఈ కేసులో భాగంగా హార్వి ఓస్వాల్డ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను కూడా అనూహ్యంగా కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు!
షేక్ ముజీబుర్ రహ్మాన్..
బంగ్లాదేశ్ జాతి పిత షేక్ ముజీబుర్ రహ్మాన్ సైతం కాల్పుల ఘటనకు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్‌కు తొలి అధ్యక్షుడిగా, తొలి ప్రధానిగా పని చేసిన ముజీబుర్ రహ్మన్‌ను 1975 ఆగస్టు 15 ఢాకాలో దుండగులు చంపేశారు. ఈ ఘటనలో ఆయన కుటుంబసభ్యులు కూడా మరణించారు.
1981లో నాటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు జైర్ రహ్మాన్ సైతం కాల్పుల ఘటనకు బలయ్యారు.
లియాఖత్ అలీ ఖాన్..
పాకిస్థాన్ తొలి ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయిన లియాఖత్ అలీ ఖాన్ సైతం ఈ విధంగానే మరణించారు. 1951 అక్టోబర్ 16న, రావల్పిండిలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన్ని దుండగులు కాల్చిచంపేశారు.
2007లో ఇదే రావల్పిండిలో మరో కీలక నేత సైతం దారుణ హత్యకు గురయ్యారు. డిసెంబర్ 27న మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొద్దిసేపటికే ఆత్మహుతి దాడికి ఆమె బలయ్యారు.
రణసింఘే ప్రేమదాస..
1989-1993 మధ్య కాలంలో శ్రీలంక అధ్యక్షుడిగా పని చేసిన రణసింఘే ప్రేమదాస సైతం కాల్పుల ఘటనలో మరణించారు.
సంబంధిత కథనం
టాపిక్